ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఎర్రగంట్లలో ఇండియా సిమెంట్ లిమిటెడ్ విశ్రాంత ఉద్యోగి వెంకటరమణయ్య దారుణహత్యకు గురయ్యారు. నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఆయన... ఇవాళ శవమై కనిపించారు. ఎర్రగంట్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముసలయ్య ఇంట్లో వెంకట రమణయ్య మృతదేహం లభ్యమైంది. కాగా ఇంట్లో మొండెం మాత్రమే లభ్యం కాగా... అతని తల కడప శివారులోని గువ్వలచెరువు ఘాట్లో పాతిపెట్టినట్లు ముసలయ్య అంగీకరించాడు. దీంతో ముసలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మృతుడు వెంకటరమణయ్య.. ఎర్రగంట్లలో చాలామందికి వడ్డీలకు అప్పులు ఇచ్చారు. ఈ లెక్కన ముసలయ్యకు కూడా దాదాపు 30 నుంచి 50 లక్షల రూపాయల వరకు అప్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. డబ్బులు చెల్లించాలని పలుమార్లు అడిగినా ముసలయ్య స్పందించలేదు. దీంతో ఈనెల 20న మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనెల 22న వెంకటరమణయ్య కనిపించడం లేదని అతని కుటుంబసభ్యులు ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శవం ఉన్న ఇంట్లో ఎవ్వరినీ పోలీసులు అనుమతించడం లేదు.
ఇవీ చదవండి: పూర్తి వేతనాల చెల్లింపునకు సర్కారు ఉత్తర్వులు జారీ