Cong MLA Jagga reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎవరితో కలిసి పని చేయాలన్నది అధిష్ఠానం నిర్ణయం మేరకు జరుగుతుందని... తమ చేతుల్లో ఏమీ లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్సెస్ తెరాస ఉంటుందని.. భాజపాది ఇక్కడ మూడో స్థానమని ఎద్దేవా చేశారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశాంత్ కిషోర్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. తమ పార్టీకి ఆయన అక్కర్లేదని, కాంగ్రెస్ పార్టీలో ఎందరో ప్రశాంత్ కిషోర్‌లు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ విషయం గాంధీభవన్‌కు వస్తే తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాము ఒక్కొక్కరు ఒక్కో ప్రశాంత్ కిషోర్‌గా ఆయన అభివర్ణించారు.
'ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 700 ఓట్లు ఉన్న తెరాస.. 230 ఓట్లు ఉన్న కాంగ్రెస్‌ను చూసి భయపడుతోంది. గత రెండేళ్లుగా స్థానిక ప్రజాప్రతినిధులను పట్టించుకోని మంత్రి హరీశ్ రావు.. ఇప్పుడు క్యాంపులు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో నిలపటం వల్లే తెరాస ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కింది.' -జగ్గారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు
MLA jagga reddy comments: బీఎస్పీ కూడా తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని అతి విశ్వాసం వ్యక్తం చేస్తోందని జగ్గారెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక ఎన్నికల్లో 230 ఓట్లున్న కాంగ్రెస్‌ను చూసి భయపడుతున్న తెరాస.. తమపై ఫిర్యాదులు చేస్తోందని విమర్శించారు. 300 మందిని ఉత్తర భారతదేశానికి టూర్‌కు పంపింది ఎవరని ఆయన ప్రశ్నించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆడియో వినిపించిన జగ్గారెడ్డి.. ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని నిలదీశారు.