రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీన విడుదల చేసిన ఓటర్ల జాబితాతో పోలిస్తే 5,99,900 మంది ఓటర్లు తగ్గారు. ఏటా నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం బుధవారం ఖరారు చేసి జిల్లాలకు పంపింది. రాష్ట్రంలో 2,95,65,669 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1,48,61,100 మంది పురుషులు కాగా, 1,47,02,914 మంది మహిళలు, ఇతర ఓటర్లు 1,655 మంది ఉన్నారు. మహిళ, పురుష ఓటర్లు తగ్గితే ఇతర ఓటర్లు మాత్రం పెరిగారు.
ఏటా జనవరి 5వ తేదీన ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను వెలువరిస్తుంది. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నారు. ఒకే ఫొటోతో ఉన్నవారిని గుర్తించి పెద్ద సంఖ్యలో బోగస్ ఓటర్లను తొలగించారు. తాజాగా ఓటు హక్కు కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో పోలింగు కేంద్రాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 34,798 ఉండగా తాజాగా ఆ సంఖ్య 34,891కు పెరిగింది.