papikondalu Boat Yatra Resumes: గోదావరి అలలపై బోటులో సాగిపోయే పాపికొండల యాత్రను తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ తిరిగి ప్రారంభించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పాపికొండల విహారాన్ని పునరుద్ధరించినట్లు సంస్థ తెలిపింది. ప్రతి శుక్రవారం రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ పర్యాటక భవన్ నుంచి బయలుదేరే బస్సు మరుసటి రోజు (శనివారం) వేకువజామున 5 గంటలకు భద్రాచలం చేరుకుంటుంది.
భక్తులు అక్కడ స్నానాలు ముగించుకుని ఉదయం 7 గంటలకు రాములవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడే కొన్ని పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చి ఉదయం 8.30 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్‌కు చేరుకుంటారు. పేరంటాలపల్లి మీదుగా కొల్లూరుకు బోటులో చేరుకుంటారు. బోటులోనే మధ్యాహ్న భోజనం చేసి రాత్రి కొల్లూరులోని బాంబూహట్స్‌లో బస చేస్తారు. మూడోరోజు (ఆదివారం) ఉదయం కొల్లూరులో అల్పాహారం ముగించుకుని అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్, నదీ స్నానం పూర్తి చేస్తారు.
మధ్యాహ్న భోజనం చేసి పోచారం బయలుదేరుతారు. పర్ణశాల సందర్శించిన తరవాత తిరిగి భద్రాచలం చేరుకుంటారు. అక్కడ హరిత హోటల్‌లో రాత్రి భోజనం చేస్తారు. అదేరోజు రాత్రి 9 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి నాలుగో రోజు (సోమవారం) ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
టిక్కెట్ ధరలివీ: పెద్దలకు రూ. 6499; చిన్నారులకు రూ. 5199. ఏసీ బస్సుల్లో ప్రయాణం, నాన్ ఏసీలో వసతి ఉంటుంది. పూర్తి వివరాలకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ వెబ్‌సైట్‌లో కానీ, టోల్‌ఫ్రీ నంబరు 1800-425-46464లోగానీ సంప్రదించాలని ఆ సంస్థ సూచించింది.
ఇవీ చదవండి: