కేంద్ర మంత్రిమండలి జౌళి రంగంలో కొత్తగా ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు కేంద్ర సాయం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, చేనేత శాఖ మంత్రి కేటీ రామారావులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర చేనేత, జౌళి శాఖల మంత్రులను కలిసి రూ.రెండు వేల కోట్లు అందించాలని అభ్యర్థించారు. వాటిపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో జౌళి రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం అయిదేళ్లలో రూ.10,683 కోట్లు వెచ్చించేలా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సెంటీవ్(పీఎల్‌ఐ) పథకాన్ని ప్రకటించింది. దాంతో లబ్ధి పొందనున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉంది.
ఆ మూడు ప్రాజెక్టులకు...
కాకతీయ మెగా జౌళి పార్కు: తెలంగాణ ప్రభుత్వం జౌళి రంగాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా జౌళి పార్కును 2017లో ప్రారంభించింది. రూ.రెండున్నర వేల కోట్లతో నిర్మాణం చేపట్టింది. మౌలిక వసతుల కోసం కేంద్ర మెగా జౌళిపార్కుల పథకం కింద రూ.వేయి కోట్లను అభ్యర్థించింది. ఈ ప్రాజెక్టు కోసం మరో వేయి ఎకరాలను సేకరిస్తామని సీఎం కేసీఆర్ ఇటీవలి భేటీలో ప్రధాని మోదీకి తెలిపారు.
పవర్‌లూమ్ క్లస్టర్: సిరిసిల్ల జిల్లాలో మెగా మరమగ్గాల సమూహం (పవర్ లూమ్ క్లస్టర్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేంద్ర సమగ్ర మరమగ్గాల సమూహాల అభివృద్ధి పథకంలో రూ.994 కోట్ల సాయాన్ని కోరింది.
మరమగ్గాల అభివృద్ధి సంస్థ: రాష్ట్రంలో మరమగ్గాల అభివృద్ధి సంస్థ స్థాపన కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని రూ.756 కోట్లు ఇవ్వాలని కోరింది.
కొత్త పథకంలో...
పీఎల్‌ఐ పథకం కింద జిల్లాల్లోని మూడో, నాలుగో శ్రేణి పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు ఈ సాయం అందుతుంది. రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల పెట్టుబడులతో కూడిన ప్రాజెక్టులకు భూమి, పరిపాలన భవన నిర్మాణం, పరిశ్రమ, యంత్రాలు, పరికరాల కొనుగోళ్లకు సాయం లభిస్తుంది. కాకతీయ, సిరిసిల్ల జౌళి పార్కులు పల్లె ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన మరమగ్గాల అభివృద్ధి సంస్థలో పరిపాలన భవనం, యంత్రపరికరాల కొనుగోళ్ల వంటివి చేపట్టాల్సి ఉంది. దీంతో రెండు ప్రాజెక్టుల్లోని పరిశ్రమలకు, అలాగే మరమగ్గాల అభివృద్ధి సంస్థకు కేంద్ర పథకం అనుకూలంగా ఉందని తెలంగాణ అధికారవర్గాలు భావిస్తున్నాయి. కొత్త పథకం కింద నిధుల సాధనకు కృషి చేస్తామని రాష్ట్ర జౌళిశాఖ ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: మొక్కుబడి సాయం... మోయలేని భారం