వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, చీఫ్ విప్లు, సీఎస్ సోమేశ్ కుమార్ సహా వివిధ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాలకు అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని... ప్రశ్నలు, సభలో చర్చకు వచ్చే అంశాలకు ప్రభుత్వం తరఫున ఆలస్యం జరగకుండా సమాధానాలు ఇవ్వాలని సభాపతులు తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు లోబడి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
సమావేశాలకు ప్రభుత్వం తరఫున పూర్తి సన్నద్ధంగా ఉన్నామన్న శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ తరహాలోనే కొవిడ్ నిబంధనలకు లోబడి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పీపీఈ, ర్యాపిడ్ పరీక్షా కిట్లు, అంబులెన్సులను అందుబాటులో ఉంచుతామని... జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం చర్యలు తీసుకోనున్నట్లు ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
ఇవీచూడండి: ఈఎస్ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్