KCR BIRTHDAY: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజైన ఫిబ్రవరి 17ను తెలంగాణ రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. రైతుబంధు సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,601 క్లస్టర్లలోని రైతు వేదికలలో ఈ ఉత్సవాలను నిర్వహించుకుందామని తెలిపారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రైతు వేదికలలో అన్నదాతలను సన్మానించుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
MLC PALLA: ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో వ్యవసాయరంగంలో రాష్ట్రం అనూహ్య ప్రగతి సాధించిందని పల్లా పేర్కొన్నారు. మిషన్ కాకతీయతో 45 వేల చెరువులను బాగు చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల కరెంటు మోటార్లకు నిరంతరం ఉచిత కరెంటు వచ్చిందన్న ఆయన.. రైతులకు ఆసరాగా నిలిచేందుకు ఇప్పటికే రూ.17,500 కోట్ల రుణాలను మాఫీ చేసిందని కొనియాడారు. ఈ క్రమంలోనే రైతు వేదికల కోసం రూ.550 కోట్లు, రైతు కల్లాల కోసం రూ.775 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సాగు అనుకూల విధానాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నదాతగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: KTR Help : మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న మంత్రి కేటీఆర్..