ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుందని నాస్కామ్ సదస్సులో మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరాన్ని ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించి.. ఈ మేరకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. ఫుడ్ సెక్యూరిటీ, మెడికల్ అండ్ హెల్త్ కేర్, అగ్రికల్చర్, గవర్నెన్సు, లా అండ్ ఆర్డర్ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పెద్ద ఎత్తున వినియోగించుకునేందుకు అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

వ్యవసాయ రంగంలోనూ ఉపయోగిస్తున్నాం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా వినియోగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తతో వ్యవహరిస్తున్నదని తెలిపారు. వ్యవసాయ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్ అనే ప్రాజెక్టును చేపట్టిందని మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా విత్తనాలు నాటే ప్రక్రియ నుంచి మార్కెట్లోకి పంటలను తీసుకువచ్చే వరకు అనేక అంశాల్లో రైతులను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వానికి సహకరిస్తాం
కేటీఆర్ వ్యక్తపరిచిన అభిప్రాయాలతో నాస్కాం ఏకీభవించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి లోతైన అవగాహన ఉన్న రాజకీయ నాయకత్వం తెలంగాణకు ఉందని.. నాస్కామ్ ఇండియా ప్రెసిడెంట్ దేబ్ జానీఘోష్ మంత్రిపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రంగంలో మరింత ముందుకు వెళ్లేందుకు అన్ని విధాలుగా నాస్కామ్ తరఫున సహకరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి : శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం.. మాక్‌డ్రిల్