కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల వర్గీకరణ.. బదిలీల విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. త్వరలోనే అమలుకానున్నాయి. ఉద్యోగులకు కేడర్ల వారీ ఐచ్ఛికాలు ఇచ్చి కేటాయింపు అవకాశం కల్పిస్తామని.. ఇందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018ను అనుసరించి జిల్లాలు, జోన్‌లు, మల్టీజోన్‌లు, వివిధ శాఖల వారీగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు, జోనల్ బదిలీలపై సీఎస్ ఆదివారం బీఆర్కే భవన్‌లో సమావేశం నిర్వహించారు. టీఎన్జీవో, టీజీవోల అధ్యక్షలు మామిళ్ల రాజేందర్, మమత సహా... ప్రధాన కార్యదర్శులు, పలువురు నేతలు భేటీలో పాల్గొన్నారు. మొదటగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోలేని.. జిల్లాల్లో పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు చేపడతామని.. కోడ్ ఎత్తివేశాక మిగిలిన జిల్లాల్లో జరుగుతుందని సీఎస్ వెల్లడించారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు.. దివ్యాంగులు, భార్యాభర్తలు, వితంతువులు, కారుణ్య నియామకాల్లోని వారి కోసం ఐచ్ఛికాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా విధివిధానాలను ఆమోదించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి.
రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు
జోనల్ విధానం అమలులో భాగంగా రాష్ట్ర స్థాయిలో వికాస్‌రాజ్ కన్వీనర్‌గా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ సలహాదారు శివశంకర్, వివిధ శాఖల అధిపతులు, రాష్ట్ర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. తొలిదశలో సొంత జిల్లాలకు ఉద్యోగుల బదలాయింపును చేపడతారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో నోడల్ కమిటీ ఉంటుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కమిటీ సభ్యులుగా ఉంటారు. సీనియారిటీకి ప్రాధాన్యమిస్తూ.. ఐచ్ఛికాలు కల్పిస్తూ ఉద్యోగుల బదలాయింపులు చేపడతారు. ఉద్యోగులు గడువులోగా ఐచ్ఛికాలతో జిల్లా నోడల్ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. నోడల్ కమిటీ వాటిని పరిశీలించి, ఖాళీల్లో సర్దుబాటు చేస్తుంది. గతంలో ఆర్డర్ టు సర్వ్ ఇతర అవసరాల దృష్ట్యా ఇతర జిల్లాల్లో పనిచేసేందుకు వెళ్లిన ఉద్యోగులు... కొత్త జోనల్ విధానం వల్ల సొంత జిల్లాలకు వచ్చే అవకాశాన్ని కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు టీజీవో, టీఎన్జీవో అధ్యక్షులు మమత, రాజేందర్‌లు కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేసి.. ఏ జిల్లా ఉద్యోగిని ఆ జిల్లాలోనే సర్దుబాటు చేయాలని సీఎస్‌ను కోరాం. దంపతులు, ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ కులాల వారికీ రోస్టర్ విధానం పాటించాలని ప్రభుత్వానికి విన్నవించాం.' -రాజేందర్, టీఎన్జీవో అధ్యక్షుడు
సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగుల కేటాయింపు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. ఉద్యోగుల ప్రత్యేక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వం రూపొందించిన గైడ్‌లైన్స్ బాగున్నాయి. క్లిష్టమైన సమస్యను సీఎం సులభంగా పరిష్కరించారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌పై త్వరలో సీఎం సమావేశం కానున్నారు.' -మమత, టీజీవో అధ్యక్షురాలు
జోనల్ స్ఫూర్తికి అనుగుణంగా.. ఏఒక్క ఉద్యోగికీ నష్టం కలగకుండా, సీనియారిటీని పరిరక్షిస్తూ, ఐచ్ఛికాలతో దీనిని ప్రభుత్వం నిర్వహిస్తుందని.. నెలలోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. త్వరలో రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తామన్నారు.
ఇదీ చదవండి: