Telangana Government Hike Diet Charges : గురుకులాలతో పాటు సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం, వసతులు అందించేందుకు ప్రస్తుతం ఉన్న డైట్ ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా.. డైట్ ఛార్జీలను పెంచుతూ సీఎం కేసీఆర్ దస్త్రంపై సంతకం చేశారు. ఈ మేరకు పెరిగిన ఛార్జీలు ఈ జులై నెల నుంచే అమల్లోకి రానున్నాయని తెలిపారు.
పెరిగిన డైట్ ఛార్జీలు మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు.. ప్రస్తుతం నెలకు అందిస్తున్న రూ.950 నుంచి రూ.1200లకు ప్రభుత్వం పెంచింది. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నెలకు డైట్‌ఛార్జీలు.. రూ.1100 నుంచి రూ.1400లకు పెరిగాయి. 11వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు డైట్‌ఛార్జీలు రూ.1500 నుంచి రూ.1875కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Diet Charges Increased in Telangana : ఈ పెరిగిన డైట్ ఛార్జీల ద్వారా ఏడున్నర లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. డైట్ ఛార్జీలు 26 శాతం పెంచడంతో.. ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి అదనంగా రూ.237 కోట్ల భారం పడనుందని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు.. డైట్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ కృతజ్జతలు తెలిపారు. సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో పలు అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపి.. ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
దివ్యాంగులకు ఆసరా పింఛన్ రూ.4016 : అలాగే దివ్యాంగులకు అందించే ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించగా.. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన మొత్తం రూ.4016లను లబ్ధిదారులకు.. ఈ నెల నుంచే అందించనున్నారు. దీంతో రాష్ట్రంలోని 5,11,656 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇలా ప్రతి నెల రూ.4016 ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.250.48 కోట్లు ఆర్థిక భారం పడనుందని వెల్లడించింది.
ఈ మేరకు దివ్యాంగుల పింఛన్ల పెంపునకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత మొత్తంలో పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని మరోసారి రుజువు చేశామని మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి :