ప్రభుత్వం ప్రకటించిన అనధికార లేఅవుట్లలోని స్థలాల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్) పథకంపై ప్రజల్లో అనేక సందేహాలున్నాయి. వాటి నివృత్తికి ‘ఈనాడు’ నిర్వహించిన ‘ఈనాడు-మీతోడు’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. వందలాది మంది తమ సందేహాలను ప్రస్తావించారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సమాధానాలిచ్చారు. ప్రభుత్వం సమయానుకూలంగా ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా దరఖాస్తుల పరిశీలన ఆధారపడి ఉంటుందని యంత్రాంగం తెలిపింది.
ఎలాంటి స్థలాలకు ఎల్‌ఆర్‌ఎస్ అవసరం?
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఇంటి స్థలాలుగా విభజించిన భూమి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుకు అర్హమైంది. అనధికార లేఅవుట్లు, గ్రామకంఠంలో ఇంటి నంబర్లతో రిజిస్టరైన స్థలానికీ అవసరం. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ చుట్టూ ఉన్న వ్యవసాయేతర భూములకూ దరఖాస్తు చేసుకోవచ్ఛు.
క్రమబద్ధీకరణ రుసుము, లేఅవుట్ ఖాళీ స్థలం ఛార్జీలను ఎలా నిర్ధారిస్తారు?
ఆగస్టు 26 నాటి మార్కెట్ విలువ ఆధారంగా పేర్కొన్న స్లాబుల ప్రకారం క్రమబద్ధీకరణ రుసుము చెల్లించాలి. భూమి రిజిస్టరైన తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా లేఅవుట్ ఓపెన్ స్పేస్ ఛార్జీ నిర్ధారిస్తారు.
దరఖాస్తు వేరొకరి పేరుతో చేస్తే?
యజమాని పేరుతో ఉన్నవే చెల్లుతాయి.
భూ యజమాని చనిపోయినప్పుడు ఏం చేయాలి?
చట్టబద్ధ వారసులు సంబంధిత అధికారులు జారీ చేసిన వారసత్వ ధ్రువపత్రాన్ని జత చేసి దరఖాస్తు చేయొచ్ఛు
దరఖాస్తు సవరణకు అవకాశమెప్పుడు?
దరఖాస్తుల పరిశీలన సమయంలో కేవలం అచ్చు తప్పులు సవరించడానికి వీలుంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులో అబ్దుల్లాపూర్‌మెట్ ఎస్‌ఆర్‌ఓ చూపించట్లేదు?
సంబంధిత పురపాలక శాఖ లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్లండి.
ఫామ్‌ల్యాండ్‌కు ఎల్‌ఆర్‌ఎస్ అవసరమా?
వ్యవసాయ భూమిని రోడ్ల సౌకర్యంతో ఫామ్‌ల్యాండ్‌గా మార్చుకున్నట్లయితే ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకోవాలి.
పర్వతాపూర్, పీర్జాదిగూడలో 2015లో ఇల్లు కట్టుకున్నాం. ఇంటికి ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకోవడం అవసరమా?
అవును, చేయించుకోవాలి.
గతంలో దరఖాస్తు చేశాం. యూఎల్‌సీ ఎన్వోసీ తీసుకోవడంలో జాప్యమైంది. ఇప్పుడు కొత్త అర్జీ పెట్టాలా?
యూఎల్‌సీ ఎన్వోసీ, ఇతర పత్రాలు జత చేస్తూ మళ్లీ దరఖాస్తు చేయాలి.
ఏజీపీఏ పత్రం ఉంది, అది ఎల్‌ఆర్‌ఎస్‌కు అర్హమా?
ఏజీపీఏ(అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) పత్రం కలిగినవారి ఆధీనంలోనే ఇంటి స్థలం ఉంటే ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవచ్ఛు.
ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు ఎలా చేయాలి?
● ప్రభుత్వం తీసుకొచ్చిన www.lrs.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా పౌరులు నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్ఛు మీ-సేవా కేంద్రం, సీజీజీ రూపొందించిన ‘ఎల్‌ఆర్‌ఎస్ 2020’ అనే మొబైల్ యాప్ ద్వారానూ అర్జీ పెట్టుకోవచ్ఛు.
దరఖాస్తు రుసుము
వ్యక్తిగత ఇంటి స్థలానికి.. రూ.1000
లేఅవుట్ డెవలపర్లకు.. రూ.10,000
ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకోకపోతే?
ప్రస్తుత నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్, భవన నిర్మాణ అనుమతి, తాగునీరు, విద్యుత్తు కనెక్షన్లు లభించవు.
ఏయే పత్రాలు అప్‌లోడ్ చేయాలి?
సేల్ డీడ్ మొదటి పేజీ, అనధికార లేఅవుట్, అవసరమైతే యూఎల్సీ నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ).