delay in Tuition fees payment to Telangana students : రాష్ట్రంలో అర్హులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు, బోధన ఫీజుల చెల్లింపులు నిలిచిపోయాయి. సంక్షేమశాఖలు దరఖాస్తులు పరిష్కరించి, నిధులు విడుదల చేసినా.. ఆర్థిక ఆంక్షల కారణంగా ఖజానా నుంచి విద్యార్థుల ఖాతాల్లోకి జమ కావడం లేదు. ట్రెజరీల్లో చెల్లింపుల కోసం ఆర్థిక శాఖ సైతం 3 నెలల క్రితమే టోకెన్లు జారీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కోర్సు ట్యూషన్ ఫీజులతో పాటు పుస్తకాలు, మెస్‌ఛార్జీల కింద ఇవ్వాల్సిన డబ్బులూ అందని పరిస్థితి నెలకొంది. గత రెండేళ్లకు సంబంధించి (2020-21, 2021-22) దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా ఫీజుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
రాష్ట్రంలో బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం ఏటా 12.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరికి చెల్లించాల్సిన ఫీజుల డిమాండ్ రూ.2,400 కోట్ల వరకు ఉంటోంది. ఇటీవల ప్రభుత్వం కొన్ని కళాశాలల కోర్సుల ఫీజులు పెంచడంతో డిమాండ్ రూ.2,450 కోట్లకు చేరింది. ప్రతి విద్యాసంవత్సరం అర్హులైన విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించి, మరుసటి ఏడాదిలో ఫీజులు చెల్లిస్తూ వస్తోంది. ఇప్పటికీ 2020-21 ఏడాదికి సంబంధించి రూ.300 కోట్ల బకాయిలు ఉన్నాయి.
2021-22 ఏడాది బోధన ఫీజులు, ఉపకార వేతనాలు ఈ ఏడాదిలో పూర్తిగా చెల్లించాల్సి ఉంది. వీటికి సంబంధించి ఇప్పటివరకు రూ.1872 కోట్ల బిల్లులను ఆయా శాఖలు ట్రెజరీకి పంపించాయి. వాటిపై ఆర్థికశాఖ అక్టోబరులో టోకెన్లు జారీ చేసింది. అయితే ఇప్పటికి కేవలం రూ.157 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. మరో రెండు నెలల్లో ఈ టోకెన్లు చెల్లుబాటు కాకుంటే.. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 3, 4 నెలలు గడిస్తేనే ఫీజులు అందే అవకాశాలు ఉంటాయి.
‘‘రెండేళ్లుగా బోధన ఫీజులు విడుదల కావడం కాలేదు. కళాశాలలను నడపడం కష్టంగా మారింది. ప్రభుత్వం టోకెన్లు తప్ప.. నిధులు ఇవ్వడం లేదు. వెంటనే నిధులు విడుదల చేయాలి’’ అని తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల అధ్యక్షుడు గౌరీసతీష్ డిమాండ్ చేశారు.
సరిపోని బడ్జెట్.. బీసీ సంక్షేమశాఖ పరిధిలో బీసీ, ఈబీసీ విద్యార్థుల కోసం బడ్జెట్‌లో రూ.1360 కోట్లు పేర్కొన్నారు. అయితే వాస్తవిక డిమాండ్ రూ.1700 కోట్ల వరకు ఉంటోంది. ఈ ఏడాదికి ఇప్పటివరకు రూ.1149 కోట్ల నిధులు విడుదల చేయగా.. ఇందులో రూ.77 కోట్ల బిల్లులు మాత్రమే మంజూరయ్యాయి. ఇతర శాఖల పరిధిలోనూ ఇదే పరిస్థితి ఉంది.
దరఖాస్తు గడువు పొడిగించే అవకాశం.. ప్రస్తుత విద్యాసంవత్సరానికి బోధన ఫీజుల దరఖాస్తు గడువు పొడిగించాలని సంక్షేమశాఖలు భావిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం మెడికల్, ఇతర కోర్సుల ప్రవేశాలు ఆలస్యమయ్యాయి. దీంతో అర్హులైన విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకునేందుకు మరో 2 నెలలు గడువు పెంచాలని ప్రభుత్వానికి ఆయా శాఖలు లేఖ రాశాయి. ప్రస్తుత గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ప్రభుత్వం అనుమతిస్తే మార్చి 31 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం లభించనుంది.
ఇవీ చదవండి: