Pattabhi arrest updates : ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం సీఐపై హత్యాయత్నం చేశారనే అభియోగాలపై.. తెలుగుదేశం నేత కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు గన్నవరం అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేశారని ఆయన ఫిర్యాదు చేశారు. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాడి జరిగిందని తెలిసి అక్కడకు వెళ్తుండగా.. పోలీసులు గాంధీ బొమ్మ వద్దే తనను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తన వాహనంలోనే హనుమాన్ జంక్షన్ మీదుగా గుడివాడ తీసుకెళ్లారు. అక్కడ పొలిమేరల్లో పోలీసు వాహనంలోకి ఎక్కించారని చెప్పారు. ఆ తర్వాత తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని అన్నారు. స్టేషన్‌లోకి వెళ్లాక కరెంటు పోయిందని పేర్కొన్నారు.
ముగ్గురు వ్యక్తులు ముసుగు వేసుకొని కొట్టారు: చీకట్లో ముసుగు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు తన ముఖానికి గుడ్డ కప్పి పక్క గదిలోకి తీసుకెళ్లి 30నిమిషాల పాటు చేతులు, అరికాళ్లపై తీవ్రంగా కొట్టారని ఆయన న్యాయమూర్తికి చెప్పారు. మంగళవారం ఉదయం గన్నవరం తీసుకొచ్చి ఊరి పొలిమేర్లలో చాలాసేపు ఉంచిన తరవాత కోర్టులో ప్రవేశపెట్టారని జడ్జికి అతను వెల్లడించారు.
రిపోర్టులో మరో క్రైమ్ కేసు: పట్టాభి చేసిన ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. ఘర్షణ జరిగినప్పుడు అతని చేతులకు స్వల్ప గాయాలయ్యాయే తప్ప.. పోలీసులు గాయపరచలేదన్నారు. ఈ కేసులో ఇంకొంత మంది సాక్షుల్ని విచారించాల్సి ఉన్నందున రిమాండ్‌కు పంపాలని పోలీసులు కోరారు. దీంతో రిమాండ్ రిపోర్టులో పట్టాభిపై పోలీసులు మరో క్రైమ్ కేసును చేర్చారు.
సీఐ తలకు ఎలా గాయమైంది?: సీఐ కనకారావుని కులం పేరుతో తిట్టి, చంపేందుకు కూడా అనుచరులని రెచ్చగొట్టారని పోలీసులు ఆరోపించారు. కార్యకర్తలు రాళ్లు విసరడంతో.. సీఐ తలకు దెబ్బతగిలిందని అన్నారు. రిమాండ్ రిపోర్టు తప్పుగా ఉందని పట్టాభి తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ కార్యకర్తల విధ్వంసంపై ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న పట్టాభిపై కావాలనే పలు సెక్షన్లు నమోదు చేశారన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల విధ్వంసంలోనే సీఐకి గాయాలై ఉండొచ్చని.. టీడీపీ కార్యాలయంపై రాళ్లు విసిరి, కార్లు దహనం చేసింది ప్రత్యర్థులేనని తెలిపారు. గన్నవరం సీఐ ఎస్సీ కాదని, ఆయన క్రిష్టియన్ అని వాదనలు వినిపించారు.
అట్రాసిటీ కేసు వర్తించదు: దీనివల్ల ఈ కేసులో అట్రాసిటీ కేసు వర్తించదని చెప్పారు. సీఐ కనకారావు ఎస్సీ మాల వర్గానికి చెందినట్లు గన్నవరం తహసీల్దారు ధ్రువీకరించారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. పోలీసులు కొట్టారన్న పట్టాభి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించి అనంతరం తన ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు. పోలీసులు ఆమేరకు పట్టాభికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సుమారు రెండుగంటలపాటు వైద్య పరీక్షలు చేయించారు.ఆ తరవాత తిరిగి గన్నవరం తీసుకెళ్లారు. కేసులో పట్టాభి మినహా మిగతా నిందితులను స్థానిక సబ్‌జైలుకు తరలించారు.
ఇవీ చదవండి: