Film and Political Celebrities Paid Tributes to Tarakaratna: ఫిల్మ్‌ఛాంబర్‌లో తారకరత్న పార్థివదేహాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్నకు నివాళులు అర్పిస్తున్నారు. తారకరత్నను కడసారి చూసేందుకు ఫిల్మ్‌ఛాంబర్‌కు అభిమానులు తరలివస్తున్నారు. ఆయన పార్థివదేహాం వద్ద నివాళులర్పిస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్న నందమూరి కుటుంబసభ్యులు తారకరత్నను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.
అంతకుముందు తారకరత్న తల్లిదండ్రులు ఫిల్మ్ ఛాంబర్ వద్ద కుమారుడి భౌతికకాయాన్ని చూసి తల్లడిల్లిపోయారు. పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. సినీ ప్రముఖులు, అభిమానులు ఫిల్మ్‌ఛాంబర్‌కు చేరుకుని తారకరత్నకు నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, దగ్గుబాటి పురంధరేశ్వరి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నటుడు శివాజీ, వెంకటేశ్, ఆది శేషగిరిరావు, అనిల్ రావిపూడి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తలసాని తారకరత్న మరణం బాధాకరమన్నారు. 40 ఏళ్ల వయస్సులోనే చనిపోవడం విచారకరమని తెలిపారు. 20 ఏళ్లలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి 24కు సినిమాల్లో నటించాడన్నారు. తాత అడుగుజాడల్లో నడవాలనుకున్నాడని తలసాని పేర్కొన్నారు. తారకరత్న కుటుంబానికి, నందమూరి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. తారకరత్న మంచి నాయకుడు అవుతాడని అనుకున్నాన్న ఆయన.. అందరిని ఆప్యాయంగా బాబాయ్ అని పిలిచేవాడని గుర్తుచేసుకున్నారు. అలాగే మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తారకరత్న తనకు తమ్ముడిలాంటివాడన్నారు. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
అంతకుముందు హైదరాబాద్‌లోని శంకర్‌పల్లి మండలం మోకిల నుంచి తారకరత్న పార్థివదేహాన్ని ఫిల్మ్‌ఛాంబర్‌కు తీసుకువచ్చారు. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్ధం తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉంచారు. ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లే ముందు చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసి ప్రత్యేక అంబులెన్స్‌లో 9 :15 గంటలకు ఫిలింఛాంబర్‌కు తరలించారు. తారకరత్నను తరలించే అంబులెన్స్‌లోనే బాలకృష్ణ, ఎంపీ విజయసాయిరెడ్డిలు కూడా ఫిలింఛాంబర్ వరకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫిల్మ్‌ఛాంబర్ నుంచి మహాప్రస్థానానికి అంతిమయాత్ర చేయనున్నారు. సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇవీ చదవండి: