Irrigation projects in TS: ఫాస్ట్‌ట్రాక్ పేరుతో చాలా వేగంగా పూర్తయి ఆయకట్టుకు నీరందించాల్సిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాన పనులు పూర్తయినా సగం ఆయకట్టుకూ నీరందని పరిస్థితి. ప్రాజెక్టుల పూర్తి వ్యయాన్ని రాష్ట్రం భరిస్తుండటంతో జాప్యం జరుగుతుందని భావించిన కేంద్రం సత్వరసాగు నీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద కొన్ని నిధులను ఇస్తోంది. ఎన్డీయే ప్రభుత్వం ఏఐబీపీ పేరును ప్రధానమంత్రి కిసాన్ సంచయ్ యోజన(పి.ఎం కె.ఎస్.వై)గా మార్చింది. ఈ ప్రాజెక్టుల పురోగతిని కేంద్రం పర్యవేక్షిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.500 కోట్ల కంటే ఎక్కువ ఉన్న వాటి స్థితిగతులను నేరుగా ప్రధానమంత్రి కార్యాలయమే చూస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో నాలుగు..
fast track irrigation projects: రాష్ట్రంలో దేవాదుల, శ్రీరామసాగర్ వరదకాలువ, శ్రీరామసాగర్ రెండోదశ, భీమా ఎత్తిపోతల పథకాలు ఫాస్ట్‌ట్రాక్ సాగునీటి ప్రాజెక్టులు. ఇవన్నీ రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీరామసాగర్ రెండోదశ కింద మాత్రమే అత్యధిక ఆయకట్టుకు నీరందించారు. మిగిలిన ప్రాజెక్టుల్లో ప్రధాన పనులు పూర్తయినా సగం ఆయకట్టు కూడా తడవని పరిస్థితి. తాజాగా వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నా ఆచరణలో సాధ్యమయ్యేలా లేదు.
* శ్రీరామసాగర్ వరద కాలువలో 93,587 హెక్టార్లకు గాను 40వేల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించే పనులన్నీ పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వల పనులు పూర్తిగా జరగకపోవడంతో 19,573 హెక్టార్లకు మాత్రమే నీరందింది. 228.5 హెక్టార్ల భూసేకరణ కూడా పెండింగ్‌లో ఉంది. పునరావాసం కోసం మరికొంత కావాలి.
* గౌరవెల్లి రిజర్వాయర్ మినహా మిగిలిన పనులన్నీ వచ్చే జూన్‌లోగా పూర్తి చేయాలన్నది లక్ష్యం.కానీ జరిగే అవకాశం కనిపించడం లేదు.
* దేవాదుల మొదటి దశ పూర్తి చేసి 2008లో ప్రారంభోత్సవంచేశారు. మరికొంత కాలానికే రెండోదశ కూడా. ఈ ప్రాజెక్టు కింద 2,48,685 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 1,23,940 హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లిచ్చే పనులు పూర్తయినా, ఇచ్చింది 68,747 హెక్టార్లకే. డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వలకు మరో 1,341 హెక్టార్లు సేకరించాల్సి ఉంది. ప్రధాన, బ్రాంచి కాలువలకు కూడా 189 హెక్టార్లు కావాలి. భూసేకరణపై కోర్టు కేసులూ ఉన్నాయి.వచ్చే ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నా 2023 మార్చి వరకు అయ్యే అవకాశం లేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
* భీమా ఎత్తిపోతలదీ ఇదే పరిస్థితి. 82,155 హెక్టార్లకు గాను 59,818 హెక్టార్లకు సాగునీరందించినట్లు ఇంజినీర్లు నివేదించారు. ఇక్కడ 80 హెక్టార్ల భూసేకరణతో పాటు అయిదు గ్రామాలకు సంబంధించిన పునరావాసం ఆగిపోయింది.
* ఎస్సారెస్పీ రెండోదశ కింద మాత్రమే ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చారు. మరో 30వేల హెక్టార్లకు నీరివ్వాలి. ఈ నాలుగు ప్రాజెక్టుల తాజా అంచనా వ్యయం రూ.23,314.82 కోట్లు కాగా, గతంలో ఏఐబీపీ, ప్రస్తుత పీఎంఎస్‌కేవై కింద వచ్చింది రూ.3,929.76 కోట్లు మాత్రమే. మరో రూ.184 కోట్లు విడుదల కావాల్సి ఉంది. గతంలో నిర్ణయించిన అంచనా వ్యయంలో 25 నుంచి 30 శాతం మాత్రమే కేంద్రం ఇస్తోంది. భీమా ఎత్తిపోతలకు మాత్రం 60 శాతం. మిగిలిన మొత్తాన్ని, జాప్యం వల్ల పెరిగే ఖర్చును రాష్ట్రమే భరించాలి.