వ్యాపారులు చైనా మాంజాను పెద్దఎత్తున రహస్య, అంతర్గత గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. పాతబస్తీలోని ప్రధాన పతంగుల మార్కెట్లలో హోల్‌సేల్ దుకాణాలు అనేకం ఉన్నాయి. ఒక్కో దుకాణానికి నాలుగైదు గోదాములు ఉండడం గమనార్హం. అందరి ముందు కనిపించే దుకాణాల్లో పతంగులు, దారం, సాధారణ మాంజాలను విక్రయిస్తున్నారు. దొడ్డి దారిన చైనా మాంజాలను సరఫరా చేస్తున్నారు. పోలీసులు తనిఖీ చేస్తారన్న భావనతో ప్రార్థన మందిరాలకు అనుసంధానంగా ఉన్న మడిగెలు, గదుల్లో నిల్వ చేస్తున్నట్లు సమాచారం.
తెలిసిన వారికి సరఫరా
ఏటా జిల్లాల నుంచి పతంగులు, మాంజాలు, దారాల కోసం వచ్చే వ్యాపారులకు చైనా మంజాను రహస్యంగా అందిస్తున్నారు. కార్టూన్లలో పతంగుల మాటున దాచి ప్యాకింగ్ చేస్తున్నట్లు సమాచారం. తెలిసిన రిటైల్ వ్యాపారులకు, గ్రామాలకు చెందిన దుకాణాదారులకు దొడ్డిదారిన ఈ మాంజాను అందజేస్తున్నారని గుల్జార్‌హౌజ్‌కు చెందిన ఓ రిటైల్ వ్యాపారి తెలిపారు. హుస్సేనిఆలం, గుల్జార్‌హౌస్, యాకుత్‌పురాతో పాటు ధూల్‌పేట్, పురానాపూల్ తదితర ప్రాంతాలలోని అంతర్గత గోదాముల్లో ఈ మాంజాను ఉంచినట్లు సమాచారం. ఒక చరక్ మాంజా రూ.650 నుంచి రూ.800 వరకు అమ్ముతున్నారు.
ఆర్డరు ఒకచోట... డెలివరీ మరోచోట
తెలిసిన వారు వచ్చి దుకాణంలో డబ్బు చెల్లిస్తే చాలు యజమాని కనుసన్నల్లో మెలిగే ఏజెంట్లు కాస్తంత దూరంలో చైనా మాంజాను రహస్యంగా అందించి వెళ్లిపోతారు. దుకాణానికి ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా ఈ దందాను ప్రత్యేక ఏజెంట్లతో కొనసాగించడం గమనార్హం.
పక్షుల పాలిట యమపాశం
చైనా మాంజా పక్షుల పాలిట యమపాశంగా మారుతోంది. గాలిపటాలు ఎగురవేసినప్పుడు అత్యధికంగా పెద్ద వృక్షాలు, విద్యుత్తు స్తంభాలకు తగులుకుంటాయి. తెగిన గాలిపటాలు చెట్లకొమ్మలపైకి చేరుతాయి. ఈ మాంజా ఉచ్చులో పక్షుల రెక్కలు, కాళ్లు ఇరుక్కొని ప్రాణాలు విడుస్తున్నాయి.
నిఘా పెంచాలి
సంక్రాంతి నేపథ్యంలో వ్యాపారులు జోరుగా దందా చేస్తున్నారు. ప్రత్యేక తనిఖీలు, నిఘా, దాడులకు పోలీసులు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టకపోవడం వ్యాపారులకు కలిసివస్తోంది. కఠినంగా వ్యవహరిస్తేనే చైనా మాంజాకు అడ్డుకట్ట వేయడం సాధ్యం అవుతుంది.
- ఇదీ చూడండి: భోగి మంటల అర్థం, పరమార్థం ఏంటీ..?