Telangana School Timings Changes : పాఠశాలల సమయాల్లో చిన్నపాటి మార్పులు చేసే యోచనలో పాఠశాల విద్యాశాఖ ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నడుస్తున్నాయి. హైదరాబాద్లో కాస్త ముందుగానే మొదలవుతాయి.
School Timings Change in Telangana : ప్రాథమిక పాఠశాలల్లో చదివేది చిన్నపిల్లలు కాబట్టి వారు ఉదయం త్వరగా లేవడానికి ఇబ్బంది పడతారు. అందువల్ల వారికి ఉదయం 9.30 గంటలకు తరగతులు మొదలు పెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఉండేది పెద్ద పిల్లలైనందున వారు ఉదయాన్నే లేవగలుగుతారు కాబట్టి ఉదయం 9 గంటలకే ప్రారంభించే యోచన చేస్తున్నారు. కానీ ప్రస్తుతం పాఠశాలల సమయాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ విషయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల అన్ని పాఠశాలలను ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు ప్రారంభించాలని సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాలల సమయాల మార్పుపై ఎస్సీఈఆర్టీ అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.
భిన్న వాదనలు : పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలంటే దానికి ప్రభుత్వం ఆమోదం తెలపాల్సిందే. ఈ విషయంలో నిపుణులతో చర్చలు జరిపి అన్ని కోణాల్లో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో ప్రభుత్వ పాఠశాలలకు మరింత నష్టం జరగవచ్చని కొందరు సూచిస్తున్నారు. కాగా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉదయం 7.30, 8 గంటలకే పిల్లల్ని వాహనాల్లో ఎక్కించుకొని తీసుకెళ్తాయి. ప్రభుత్వ పాఠశాలల సమయాలు అందుకు భిన్నంగా ఉండి ఆలస్యంగా మొదలైతే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
School Timings in Telangana Villages : గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉదయం 8 నుంచి 9 గంటల లోపే కూలీ, పొలం పనులకు వెళ్తుంటారు. సాధ్యమైనంత వరకు ఉదయం తరగతులు ప్రారంభమైతేనే పిల్లలకు పాఠాలు బాగా అర్థం అవుతాయనని కొందరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి పొద్దున్నే లేచి బడికి పంపడం అలవాటు చేస్తే వారికి భవిష్యత్లో ఉపయోగపడుతుందని అధికారులు యోచిస్తున్నారు.
చిన్నపిల్లలు సాధారణంగా ఇంట్లో ఏ పనులు చేయరు కాబట్టి వారికి బడి వేళలు మార్చితే ఇంకా బద్ధకంగా మారే అవకాశం ఉంటుంది. ఉన్నత పాఠశాలలకు చాలా మంది విద్యార్థులు పొరుగు ఊళ్ల నుంచి వస్తుంటారు అందుకే వారికి ఆరగంట ఆలస్యంగా తరగతులు మొదలవుతాయి. ప్రాథమిక పాఠశాలలకు వచ్చేవారు స్థానికంగా ఉండేవారు ఉంటారు. ఈ విషయాన్ని గమనించాల్సి ఉందని మరికొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బడి సమయం మార్పులపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఇవీ చదవండి: