ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా శిల్పారామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు జరిగాయి. భోగి మంటలు, గంగిరెద్దు ఆటలు, రంగువల్లులు, కోలాటం.. సంప్రదాయ వంటకాల ప్రదర్శనతో సంబురాలు నగరవాసులను అలరించాయి. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ సురేశ్, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మేజర్ విజయలక్ష్మీ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తొలుత భోగిమంటలతో వేడుకలను ప్రారంభించారు.
భోగి మంట అనంతరం నిర్వహించిన గంగిరెద్దు ఆటలో ప్రజాప్రతినిధులు, అధికారులు సందడి చేశారు. కోలాటం మధ్య శిల్పారామం ప్రధాన ద్వారం నుంచి సాంస్కృతిక వేదిక వద్దకు చేరుకున్నారు. సభా కార్యక్రమాల తర్వాత.. పతంగులను ఎగురవేసి.. సంప్రదాయ వంటకాల ప్రదర్శనను తిలకించారు. అంతకుముందు చేపట్టిన సభా కార్యక్రమాల్లో కలెక్టర్, డిప్యూటీ స్పీకర్, జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ.. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఏడాది అందరూ సుఖ సంతోషాలతో గడపాలని.. ముఖ్యంగా రైతుల ఇంట సిరులు పండాలని ఆకాంక్షించారు. చిన్ననాటి సంక్రాంతి ఆటపాటలను నెమరువేసుకుంటూ.. భావితరాలకు తెలుగు సంప్రదాయలను అందించేందుకు ఇలాంటి పండుగ వేడుకలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. శిల్పారామంలో ప్రభుత్వం తరపున సంక్రాంతి వేడుకలు నిర్వహించటంపై అధికారులను అభినందించారు. అనంతరం.. సంక్రాంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు, సంప్రదాయ వంటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
ఇవీ చదవండి :