RTC employees Protest at bandlaguda RTC Depot : బండ్లగూడ ఆర్టీసీ డిపోకు చెందిన శ్రీవిద్య ఆత్మహత్య ఘటనపై తొలి ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మహిళ కండక్టర్ ఆత్మహత్య చేసుకోవడానికి అధికారుల వేధింపులే కారణం అంటూ ఆర్టీసీ కార్మికులు, మహిళా కండక్టర్లు, వివిధ పార్టీల నేతలు బండ్లగూడ డిపో ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలని, టార్గెట్ల పేరుతో విధింపులు ఆపాలని... లేకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
RTC Employe Srividhya Suicide in Hyderabad : బండ్లగూడ డిపోలో పనిచేస్తున్న శ్రీవిద్య.. రెండ్రోజుల కిందట స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసింది. గమనించిన కుటుంబసభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. శ్రీవిద్య డ్యూటీ చేసే రూట్లో హై టెన్షన్ లైన్ కారణంగా బస్టాప్ మార్చారని, డ్యూటీలో భాగంగా ఓ కాలనీకి బస్ వెళ్లకపోవటంతో ఫిర్యాదు వచ్చింది. దీనిపై డ్రైవర్‌ను, కండక్టర్ శ్రీవిద్యను అధికారులు మందలించారని సిబ్బంది తెలిపారు. ఆ కారణంతోనే మహిళా కండక్టర్ సూసైడ్ చేసుకుందని వాపోయారు. ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జోక్యం చేసుకొని విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి, తోటి ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
"కాస్త ఆలస్యమైనా ఇంటికి పంపించేస్తారు. ముందు చెప్పినా పేమెంట్ కట్ చేసేస్తారు. పొద్దున 5 గంటలకు వచ్చి 8 వరకు ఉద్యోగాలు చేయించుకుంటారు. ఎవరికైనా బాగోకపోతే మేడమ్‌ని కలవడానికి వెళ్తే కలవరు.. మీరు బయటకు వెళ్లండి అని బయటకు పంపించేస్తారు. మా సమస్యలు తీర్చే మేడమ్ పట్టించుకోకపోతే ఇంకా ఎవరు పట్టించుకుంటారు. మాకు న్యాయం కావాలి." - ఆర్టీసీ సిబ్బంది
Couple Suicide in Peddapalli : ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య.. అనాథలైన ఆ పసిబిడ్డలకు దిక్కెవరు?
ఈ ఘటనపై బండ్లగూడ డిపో ఆర్వీఎం సుచరిత స్పందించారు. కండక్టర్ శ్రీవిద్య అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుందని తెలిసిందన్నారు. చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుందని.. రోజు రాత్రి స్లీపింగ్ పిల్స్ వేసుకుంటేనే పడుకుంటుందని చెప్పారు. ఆర్టీసీలో సిబ్బందిని వేధింపులకు గురి చేసే అవకాశం లేదని సుచరిత తెలిపారు. వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే సిబ్బంది వెల్ఫేర్ కమిటీ ఉందని.. అక్కడ చెప్పుకుంటే సరిపోయేదని చెప్పారు. శ్రీవిద్యను బండ్లగూడ డిపో నుంచి హయత్‌నగర్ డిపోకు బదిలీ చేశారని సిబ్బంది చేస్తున్న ఆరోపణలను కూడా ఆర్వీఎం సుచరిత ఖండించారు. ఎన్నికల కోడ్ సమయంలో ఎలా చేస్తామని ఆమె అన్నారు. హయత్‌నగర్‌కు బదిలీ చేశారన్న ఆరోపణలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
'గమ్యం చేరక ముందే వీరు తిరిగి వచ్చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తాం. వాళ్లని డిపో స్పేర్‌లో పెడతాం. వీరు ఆ తప్పు చేసినా ఈ కేసులో స్పేర్‌లో కూడా పెట్టలేదు. వారికి డ్యూటీ ఇచ్చేసాం. అడిగినందుకే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు కానీ తనకు ముందు నుంచే ఆరోగ్యసమస్యలు ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ సమయంలో ఎలాంటి ట్రాన్స్‌ఫర్స్ ఇవ్వము. అవసరముంటే ఒకరోజు మారుస్తాం. శ్రీవిద్య రోజు నిద్రమాత్రలు తీసుకుంటుంది అని తెలిసింది. రిపోర్ట్స్ వచ్చాక చూడాలి అసలు ఏమైందో.' - సుచరిత, బండ్లగూడ డిపో ఆర్వీఎం