TSPSC Paper Leakage Case update : టీఎస్‌పీఎస్సీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తూ.. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డికి కోర్టు బెయిల్ తిరస్కరించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు దశలో ఉందని.. ఆయనకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న సిట్ తరఫు న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. పబ్లిక్ కమిషన్‌లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి, ప్రధాన నిందితుడు ప్రవీణ్‌తో కలిసి ప్రశ్నాపత్రాలను లీక్ చేశాడని.. పలువురికి విక్రయించి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు సిట్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితులు ఎవరెవరికి ప్రశ్నాపత్రాలు విక్రయించారో తెలుసుకోవాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యూజిలాండ్‌లో ఉన్న తన బావ ప్రశాంత్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశ్నాపత్రం విక్రయించాడని.. అతను ఇంకా పరారీలోనే ఉన్నట్లు సిట్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. మార్చి 13న రాజశేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేశారని.. 2 నెలలకు పైగానే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నట్లు నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాడని.. బెయిల్ మంజూరు చేయాలని రాజశేఖర్ రెడ్డి తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసి పుచ్చింది.
మరో ఇద్దరి బెయిల్ పిటిషన్ తిరస్కరణ : టీఎస్‌పీఎస్సీ పేపర్ల కేసులో 17, 18వ నిందితులుగా ఉన్న సాయి లౌకిక్, సాయి సుష్మిత బెయిల్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఇప్పటికే 42 రోజులుగా జైళ్లో ఉంటున్నామని.. కొందరు నిందితులకు బెయిల్ వచ్చినందున తమకు మంజూరు చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తామని.. ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు.
సాయి సుష్మిత ప్రశ్నాపత్రం అక్రమంగా పొంది పరీక్ష రాశారని.. ఆమె భర్త సాయి లౌకిక్ ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. పిటిషన్ ఉపసంహరించుకొని కింది కోర్టును ఆశ్రయించేందుకు అనుమతివ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. ఉపసంహరణను అంగీకరిస్తూ.. బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ఇవీ చదవండి:
- TS Ministers Cabinet Meeting: ముగిసిన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- Ocugen company investments in telangana : భాగ్యనగరానికి మరో అంతర్జాతీయ సంస్థ.. కేటీఆర్ వెల్లడి
- Prashant Reddy Fires On Bandi Sanjay : మాటలు జాగ్రత్త.. నీ చుట్టూ ఉన్న వాళ్లే నిన్ను చూసి నవ్వుతున్నారు
- Prof Kodandaram fires on KCR : ప్రజాసంక్షేమంపై చిన్నచూపు.. ఆస్తుల సంపాదనపై పెద్దచూపు