Concern Of Police Candidates about GO 46 : రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 46నంబర్ జీవో అభ్యర్ధుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఈ జీఓ 9శాఖలకు సంబంధించినదైనా, తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి చేపట్టిన రాష్ట్ర ప్రత్యేక పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టీఎస్ఎల్పీఆర్బీ తొలిసారిగా సీడీఎస్ వారీగా పోస్టుల్ని భర్తీ చేస్తుండటం అభ్యర్థుల ఆందోళనకు కారణమవుతోంది.
GO 46 Issue in telangana 2023 : రాష్ట్రంలో కొత్త జిల్లాలవారీగా ఉద్యోగుల విభజనకు సంబంధించి రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం 2021 డిసెంబరు 6న జీవో 317ను జారీ చేసింది. కానీ కొన్నిశాఖలకు జిల్లాలవారీగా యూనిట్లు లేవు. 9 శాఖలకు సంబంధించి 2022 ఏప్రిల్ 4న ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం జీఓ 46ను జారీ చేసింది. గతంలో టిఎస్ఎస్పి కానిస్టేబుల్ పోస్టులు రాష్ట్రస్థాయి కేటగిరీలో ఉండటంతో 2016, 2018 నాటి నోటిఫికేషన్లలో ఇబ్బందులు తలెత్తలేదు. తాజా నియామకాల్లో మాత్రం రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన జిల్లాలకు పోస్టుల నిష్పత్తి కేటాయించారు. ఈ నిష్పత్తి ప్రకారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే దాదాపు 53శాతం ఉద్యోగాలు, మిగిలిన 27పోలీసు యూనిట్లన్నింటిలో కలిపి 47శాతం పోస్టులు భర్తీ కానుండటంతో గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
''టీఎస్ఎల్పీఆర్బీ నిర్వహించిన ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యి, కష్టపడి ఈవెంట్స్, మెయిన్స్ పాస్ అయ్యాను. సర్టిఫికెట్స్ పరిశీలన కూడా పూర్తయింది. జీవో 46 అనేది 2022 లో తీసుకొచ్చారు. 2016, 2018 నాటి నోటిఫికేషన్లలో 98 మార్కులు వస్తే జాబ్ వచ్చేది. ఇప్పుడు 130 మార్కులు వచ్చినా జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ప్రధానంగా స్టేట్ పోస్టులు అనేవి జిల్లాల వారిగా తీయడం వల్ల గ్రామాల అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది.'' - పోలీస్ అభ్యర్థులు
Protests against GO 46 Telangana : హైదరాబాద్ కమిషనరేట్‌లో పోస్టులెక్కవగా ఉన్నా...పోటీపడే అభ్యర్ధుల సంఖ్య తక్కువ. అందువల్ల అక్కడ కటాఫ్ మార్కుల స్థాయి తక్కువగా ఉంటుందని అభ్యర్ధులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన అభ్యర్థులకు నష్టం జరుగుతుందనే వాదన వెల్లువెత్తుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఐటీ, సేవ, వైద్య.. తదితర రంగాల్లో అపార అవకాశాలున్నందున పోటీపడేవారు తక్కువగా ఉంటారని గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల వాదన. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ చేసి ఇక్కడి పోస్టుల్లో మిగిలిన జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా టీఎస్ఎస్సీ నియామకాల విషయంలో జీఓ నెంబర్ 46 అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని, ఇన్నేళ్లు కష్టపడి చదివి, పోటీపడి అర్హత సాధించిన గ్రామీణ ప్రాంత అభ్యర్ధులకు న్యాయం చేయాలని అభ్యర్ధులు కోరుతున్నారు.
''రెండు సంవత్సరాలు హాస్టల్లో ఉంటూ సరైన తిండిలేక కష్టపడి చదివి మెయిన్స్ పాసయ్యాము. ఇప్పుడు జీవో నెం 46 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. హైదరాబాద్‌లో పోస్టులు ఎక్కువ ఉన్నా పోటీపడే అభ్యర్ధుల సంఖ్య తక్కువ.. అందువల్ల అక్కడ కటాఫ్ మార్కుల స్థాయి తక్కువగా ఉంటుంది. అక్కడ మిగిలిన పోస్టులను జిల్లాల వారిగా కేటాయించాలి . ఇన్ని రోజులు నుంచి రోడ్లు పట్టుకొని తిరిగినా నాయకులు పట్టించుకోవట్లేదు.'' - పోలీస్ అభ్యర్థులు