President Droupadi Murmu Hyderabad Tour : శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 18న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. 23న తిరిగి దిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో డీజీపీ రవి గుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సీనియర్ పోలీసు అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈనెలలో.. యాదాద్రి క్షేత్రానికి రాష్ట్రపతి రాక!
President Droupadi Murmu Will Come to The State : రాష్ట్రపతి పర్యటన కోసం తగిన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు విషయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను అదేశించారు. ఆరోగ్యం, రోడ్లు భవనాలు, మున్సిపల్, విద్యుత్, సంబంధిత శాఖలు కూడా బ్లూ బుక్ ప్రకారం ఫూల్‌ప్రూఫ్ ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. పోలీస్, రోడ్లు, భవనాలు, జీహెచ్‌ఎంసీ(GHMC), జలమండలి, అటవీ, విద్యుత్ తదితర శాఖల సిబ్బందితో పాటు కంటోన్మెంట్ బోర్డు, రక్షణశాఖ అధికారులు రాష్ట్రపతి పర్యటనపై దృష్టి సారించారు.
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బొల్లారం నిలయానికి రావడం ఇది రెండోసారి. సాధారణంగా వర్షాకాలం, శీతాకాలం విడిది కోసం ఇక్కడికి రావడం ఆనవాయితీ. కొన్ని కారణాల వల్ల దశాబ్దంన్నర నుంచి రాష్ట్రపతులు శీతాకాల విడిది మాత్రమే నిర్వహిస్తున్నారు. మధ్యలో ప్రణబ్ ముఖర్జీ ఒకసారి వర్షాకాల విడిది చేశారు. గత ఏడాది తొలిసారి శీతాకాలం విడిది కోసం వచ్చిన ముర్ము రాష్ట్రపతి నిలయంను సామాన్యులు అన్ని రోజులు సందర్శించేలా అవకాశం కల్పించారు. రాష్ట్రపతి బసచేసే సమయంలో తప్ప మిగతా రోజుల్లో ఈ చారిత్రక భవనాన్ని సందర్శించే అవకాశం ఉంది.
మరోవైపు రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా రాష్ట్రపతి వస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళి సై(Governor Tamilisai), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, కీలక అధికారులు స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా గవర్నర్ రాజ్భవన్లో టీ పార్టీ ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది. గత ఏడాది కూడా ఈ వేడుకను రాజ్భవన్లో నిర్వహించారు.