Pk Meet Cm Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన వేళ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర పర్యటన ఆసక్తి రేపుతోంది. రెండు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్... సీఎం కేసీఆర్‌ను ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలిశారు. దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు, కేసీఆర్ ఆలోచనలు, వ్యాఖ్యలపై పీకే బృందం వివిధ రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ అభిప్రాయాలు సేకరిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్... సంబంధిత అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
ఇటీవల ముంబయి పర్యటనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చర్చల సారాంశం, తదితర అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు చర్చించినట్లు చెప్తున్నారు. అటు సినీనటుడు ప్రకాశ్ రాజ్ కూడా గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ప్రశాంత్ కిషోర్, ప్రకాశ్ రాజ్ ఇరువురూ మల్లన్నసాగర్ జలాశయం, పంప్ హౌస్ సహా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆయా వర్గాల అభిప్రాయాలను కూడా ప్రశాంత్ కిషోర్ తెలుసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
CM KCR MUMBAI TOUR: దేశంలో గుణాత్మక మార్పులకు, ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రేలు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కలిసి నడవాలని నిర్ణయించారు. తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వెళ్లనున్నట్లు చెప్పారు. దేశప్రజలు మార్పు కోరుకుంటున్నారని, భాజపా ముక్త్‌భారత్ కోసం ముంబయి వేదికగా అడుగులు వేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే సమావేశానికి రావాలని ఆయన ఠాక్రేను ఆహ్వానించారు. రెండు రాష్ట్రాల బంధాన్ని దేశ ఐక్యత కోసం ఉపయోగిస్తామని, అన్ని అంశాలపై తాము ఏకాభిప్రాయానికి వచ్చామని ఉద్ధవ్ తెలిపారు. దేశ హితం కోసం కేసీఆర్‌తో కలిసి నడుస్తామన్నారు. జాతీయ రాజకీయాలు, దేశాభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై తాము చర్చించామని చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భాజపాను చిత్తు చేద్దామని ఠాక్రే అన్నారు.
ఇదీ చూడండి: CM KCR MUMBAI TOUR: మార్పునకు తరుణమిదే.. భాజపాను చిత్తుగా ఓడించాల్సిందే