ప్రియాంక పోస్టర్‌పై ఇరు పార్టీల మాటల యుద్ధం
దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో కలిసున్న రాబర్ట్ వాద్రా పోస్టర్లను తొలగించటంపై ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భాజపా కార్యకర్తలే ఈ చర్యకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత జగదీష్ శర్మ ఆరోపించారు. మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన పోస్టర్లను తెల్లారేసరికి తీసివేయించి మోదీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
పోస్టర్ల తొలగింపుపై మరో కాంగ్రెస్ నేత సంజయ్‌సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ భర్త. వారి మధ్య విబేధాలు లేవు. అన్యోన్యంగా ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు . ప్రియాంక గాంధీ చరిష్మాను తగ్గించేందుకే భాజపా ఈ విధమైన ప్రయత్నాలు చేస్తోంది."-సంజయ్ సింగ్, కాంగ్రెస్ నేత
పోస్టర్ల వ్యవహారంపై భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. అవినీతి చేయడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య అజెండా అని విమర్శించారు.
"కాంగ్రెస్ పార్టీ ముఖ్య అజెండా 'అవినీతి'. అందుకనుగుణంగానే కాంగ్రెస్ కార్యకలాపాలున్నాయి. ఈ రోజు పొద్దున్నే లేచి టీవీ చూడగానే, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇద్దరు నేరస్తుల చిత్రాలు కనిపించాయి. అయితే వారిద్దరు బెయిల్‌పై బయటే ఉన్నారు. 5 వేల కోట్ల రూపాయల నేషనల్ హెరాల్డ్ కేసుతో సంబంధమున్న రాహుల్‌గాంధీ మొదటి నేరస్థుడు కాగా, పోస్టర్లో రెండో ముద్దాయి ఈడీ కేసుతో సంబంధమున్న రాబర్ట్ వాద్రా."-సంబిత్ పాత్రా, భాజపా అధికార ప్రతినిధి