Police Security for Polling Day in Telangana : రాష్ట్రంలో పోలింగ్‌కు(TS Elections) మరి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాల రక్షణ మధ్య పోలింగ్ సిబ్బంది.. వాళ్లకు నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు ప్రశాంతంగా చేరుకొని ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌కు రంగం సిద్ధం - పూర్తైన ఎన్నికల సామగ్రి పంపిణీ
Telangana Assembly Elections 2023 : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానం చేశారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఉన్నతాధికారులు పర్యవేక్షించే సిబ్బందికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు.
కెమెరా మౌంటెడ్ వాహనాలతో పాటు.. గస్తీ వాహనాలు పోలింగ్ కేంద్రాల చుట్టూ చక్కర్లు కొడుతూ ఎవరైనా గుమిగూడినా.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా చర్యలు తీసుకోనున్నారు. ఎన్నికల విధుల్లో లక్ష మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. ఇందులో 45 వేల మంది రాష్ట్ర పోలీసులు.. 3వేల మంది ఇతర శాఖలకు చెందిన ఖాకీలు, 50 కంపెనీల స్పెషల్ పోలీసులు, 375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.
ఓటరు మహాశయా మేలుకో - ఇకనైనా బద్ధకాన్ని వీడి పోలింగ్ కేంద్రానికి పోటెత్తు
వీళ్లకు అదనంగా 23,500 మంది హోంగార్డులు సైతం ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. కర్ణాటక నుంచి 5వేల మంది హోంగార్డులు, మహారాష్ట్ర నుంచి 5వేలు, చత్తీస్‌గఢ్ నుంచి 2500, మధ్యప్రదేశ్ నుంచి 2వేలు, ఒడిషా నుంచి 2వేల మంది హోంగార్డులు విధులు నిర్వహించనున్నారు. కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో సీఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్, సశస్త్ర సీమాబల్‌కు చెందిన పోలీసులు ఉన్నారు.
ఒక్కో కంపెనీలో 80 నుంచి 100 మంది ఉంటారు. హైదరాబాద్(Hyderabad), సైబరాబాద్, రాచకొండతో పాటు ఇతర జిల్లాలకు బలగాలను పంపించారు. మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. 28వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 6గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు మూసేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో కేంద్ర సాయుధ బలగాలతో పాటు స్థానిక పోలీసులు పహారా కాస్తున్నారు. ఓటర్లు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఎన్నికల్లో మీ ఓటు ఇంకొకరు వేశారా - ఇలా చేస్తే మీ హక్కు మీరే వినియోగించుకోవచ్చు