Private Schools Fee Hike in Telangana : హైదరాబాద్లోని తార్నాక దగ్గరలో ఉన్న ఓయూ సమీపంలోని డీడీ కాలనీలో ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 8వ తరగతి ఫీజు రూ.80 వేలు. వచ్చే సంవత్సరం 9వ తరగతి చదివేందుకు రూ.1.20 లక్షలు చెల్లించాలని ఆ పాఠశాల ప్రతినిధులు సమాచారం పంపారు. అంటే పై తరగతికి 50 శాతం వరకు ఫీజు పెంచేశారన్నమాట.
- నగరంలోని కోకాపేటలో ఉన్న ఓ అంతర్జాతీయ పాఠశాలలో ఈ ఏడాది 4వ తరగతికి రూ.1.23 లక్షల ఫీజు ఉంది. అదే వచ్చే సంవత్సరం ఐదో తరగతిలో చేరాలంటే రూ.1.58 లక్షలు చెల్లించాలనే సందేశం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు వెళ్లింది. అంటే పైతరగతికి పాఠశాల ఫీజు అదనంగా రూ.35 వేలు (28 శాతం) పెరిగింది.
ఈ విధంగా తెలంగాణలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటేటా భారంగా మారుతున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలలు.. ముఖ్యంగా కార్పొరేట్, ఇంటర్నేషనల్ బడులు ఇష్టారీతిన ఫీజులను పెంచుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకు పెంచేశాయి. మరికొన్ని కార్పొరేట్ పాఠశాలలు 40-50 శాతం పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయి.
2020-21, 2021-22 విద్యాసంవత్సరాలకు కరోనా మహమ్మారి కారణంగా పాత ఫీజులే తీసుకోవాలని సర్కార్ ఆదేశించింది. అలాంటి ఆదేశాలేవీ లేకపోవడంతో పలు పాఠశాలలు 2022-23 విద్యా సంవత్సరంలో బడి ఫీజులు భారీగా పెంచాయి. అలాగే వచ్చే సంవత్సరమూ మరోసారి మోత మోగించనున్నాయి. ఇప్పటికే చాలా పాఠశాలల కొత్త ఫీజుల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయగా.. మరికొన్ని ఈ నెల 15వ తేదీ తర్వాత నిర్ణయించనున్నాయి. ఇదే విషయమై తల్లిదండ్రులు పాఠశాలల యాజమాన్యాలను ప్రశ్నిస్తే తామూ సిబ్బంది వేతనాలను పెంచాలంటూ వాదిస్తున్నాయి. కొన్ని పాఠశాలలు సిబ్బందికి అరకొర జీతాలు పెంచి.. మిగిలిన మొత్తాన్ని తమ జేబుల్లో వేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అమలుకు నోచుకోని నియంత్రణ చట్టం : పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని 2022 జనవరి 17వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఆనాడే 11 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. పాత బడి ఫీజు కంటే ఏటా 10 శాతానికి మించి పెంచకూడదని, మరికొన్ని సిఫారసులను అమలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆ కమిటీ పంపింది. వీటిపై చట్టం చేయాలంటే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. గత సంవత్సర కాలంగా అలాంటి ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేనందువల్ల ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఆ దిశగా కూడా ప్రభుత్వ చర్యలు లేవు. దాంతో వచ్చే సంవత్సరం ఫీజులు మరింత భారం కానుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాం : 'మేము దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు అడిగితేనే చట్టం తీసుకువస్తామని మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం నియమించింది. అయినా చర్యలు లేకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశాం. దాంతో ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఫీజుల నియంత్రణపై ఆచార్య తిరుపతిరావు కమిటీ 2017 డిసెంబరులో నివేదిక సమర్పించింది. అయిదేళ్లు దాటినా ఇప్పటికీ కమిటీ సిఫారసులను పరిశీలిస్తున్నామని సర్కారు చెబుతోంది. ప్రభుత్వ చిత్తశుద్ధి లేమితో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా రుసుములను పెంచుతున్నాయి.'-వెంకట్, సంయుక్త కార్యదర్శి, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్
ఇవీ చదవండి :