Revanth Reddy Fires on KCR: రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలపై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ ఓటమి భయంతోనే ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సాంకేతికంగా క్షుణంగా సేకరించిన డేటాను ఎత్తుకెళ్లడం దొంగతనమని విమర్శించారు. ఫిర్యాదు కాపీనీ, ఎఫ్ఐఆర్ను చూపించమంటే పోలీసులు ఎందుకు చూపించడం లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. లిక్కర్ మాఫియాలో కవిత ప్రమేయానికి సంబంధించి సోషల్ మీడియాలో సమాచారాన్ని పెట్టినందుకే ఈ దాడి చేశారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు.
"ఉన్నతాధికారులకు ఈ విషయమై ఫోన్ చేస్తే వారు స్పందించలేదు. నిజంగా అక్కడ ఏదైనా తప్పు జరిగితే ఫిర్యాదు కాపీని, ఎఫ్ఐఆర్ను చూపించి పోలీసులు చర్యలు తీసుకోవాలి. కానీ బీఆర్ఎస్ అల్లరి మూకలగా మాదిరిగా పోలీసులు కార్యాలయంపై దాడి చేశారు. మేము సేకరించిన డేటాను ఎత్తుకెళ్లారు. ఇది దొంగతనం. కేసీఆర్ ఓటమి భయంతోనే ఈ దాడులకు పాల్పడుతున్నారు." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
అంతకు ముందు కాంగ్రెస్ వార్ రూమ్ సీజ్ చేయడంపై ఏఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్‌రూమ్ సీజ్‌పై ఇవాళ పార్లమెంట్‌లో మాణిక్కం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణలు నిరసనలు చేపట్టాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. కాంగ్రెస్ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ మల్లు రవితో పాటు మరికొందరు నేతల వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యపథంలో ధర్నా చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. తమను హౌస్ అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
ఇవీ చదవండి: కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో పోలీసుల సోదాలు
దిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద నిరసనకు దిగనున్న కాంగ్రెస్ నేతలు