హైదరాబాద్ బాలానగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీడిమెట్ల అయోధ్యనగర్‌లో నివాసముంటున్న బచ్చన్కుమార్... తన భార్య మీరాదేవి, కూతురు నందినితో కలిసి నిన్న రాత్రి 11 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై కాటేదాన్‌లోని బంధువుల ఇంటికి బయల్దేరారు. బాలానగర్ వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ఆగి ఉన్న కంటైనర్‌ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో బచ్చన్ కుమార్(35) అక్కడిక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాల పాలైన మీరాదేవి(32), నందిని(12)ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మీరాదేవి మృతి చెందింది. ఈ ప్రమాదంలో బచ్చన్ కూతురు నందిని ప్రాణాలతో బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరిక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: 'ధిక్కరణ చర్యలు చేపట్టే అధికారం మాకు ఉంది'