ఒడిశా నుంచి బయల్దేరిన ఆక్సిజన్ ట్యాంకర్లు రాష్ట్రానికి చేరాయి. పది ట్యాంకర్లకు గానూ ఆరు సోమవారం రాత్రి వరకు చేరుకున్నాయి. వాటిని వెనువెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు అధికారులు పంపించారు. వాయుసేనకు చెందిన యుద్ధ విమానాల్లో ఒడిశాకు పంపించిన ఖాళీ ట్యాంకర్లు రవుర్కెలా, అనుగుల్ ఉక్కు కర్మాగారాల్లో ఆక్సిజన్‌ను నింపుకొన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తెలంగాణకు బయల్దేరాయి. మొదటి ట్యాంకర్ సోమవారం సాయంత్రం 4:30 గంటలకు ఖమ్మం చేరింది. అక్కడ ఆసుపత్రిలోని ప్లాంటులో నింపి.. అక్కడినుంచి బయల్దేరింది.
మరో ట్యాంకర్ నేరుగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్‌కు వచ్చింది. అక్కడి ప్లాంటుకు ఆక్సిజన్‌ను సరఫరా చేసింది. మూడో ట్యాంకర్ కరీంనగర్‌కు బయల్దేరింది. నాలుగో ట్యాంకర్ కింగ్‌కోఠి ఆసుపత్రి, అయిదో ట్యాంకర్ ఛాతివ్యాధుల ఆసుపత్రికి చేరుకున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న ప్లాంట్లలో నింపిన ఆక్సిజన్‌ను రోగులకు సరఫరా చేసేందుకు వైద్య సిబ్బంది చర్యలు చేపట్టారు. ఆరో ట్యాంకర్‌ను చర్లపల్లికి పంపించారు. అక్కడ ట్యాంకర్ నుంచి సిలిండర్లలో ఆక్సిజన్ నింపి.. అన్ని ఆసుపత్రులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరో నాలుగు ట్యాంకర్లు సోమవారం రాత్రి పొద్దుపోయేవరకు రాష్ట్ర సరిహద్దుకు చేరుకున్నాయి. వాటి ద్వారా మంగళవారం రాష్ట్రంలోని ఇతర ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ట్యాంకర్ల రాకపోకలను అధికారులు రియల్ టైమ్ ట్రాకింగ్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
తమిళనాడు ఆక్సిజన్‌పై లేఖ రాయనున్న ప్రభుత్వం
తమిళనాడు నుంచి కేంద్ర ప్రభుత్వం 55 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తెలంగాణకు కేటాయించింది. దాన్ని మన రాష్ట్రానికి పంపించేందుకు ఆ రాష్ట్రం ససేమిరా అనడంపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళనతో ఉంది. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అవసరం పెరుగుతోంది. ఒడిశా నుంచి 200 మెట్రిక్ టన్నులు రావడం ఊరట కలిగించినా తమిళనాడు నుంచి కేటాయించిన ఆక్సిజన్ సైతం అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయనుంది.
ఆక్సిజన్ రవాణాలో ఆర్టీసీ డ్రైవర్లు
కరోనా కష్టకాలంలో ఆర్టీసీ డ్రైవర్లు సరికొత్త పాత్ర పోషిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు.. రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్‌ను ప్లాంట్ల నుంచి భారీ ట్యాంకర్లలో తీసుకువస్తున్నారు. ఇప్పటికే 25 మంది డ్రైవర్లు ఒడిశాలోని ప్లాంట్‌ల నుంచి తెలంగాణకు ప్రాణవాయువును చేరుస్తున్నారు. అత్యవసర సమయంలో ఆర్టీసీ సేవలు అవసరమని ప్రభుత్వం కోరిందని.. తమ వద్ద భారీ వాహనాలను నడిపే అనుభవం ఉన్న డ్రైవర్లను ఎంపిక చేసి పంపించామని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో ఒడిశాలో నుంచి తెలంగాణకు ప్రాణవాయువు తీసుకురావడంలో ఆర్టీసీ డ్రైవర్లు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమైనవని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పేర్కొన్నారు. అవసరమైతే మరింతమంది డ్రైవర్లను పంపుతామని ‘ఈనాడు’కు తెలిపారు.