కరోనా వైరస్ నేపథ్యంలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహణ మారిపోయింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకుండానే నెలపాటు ఈ కార్యక్రమం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
బాల కార్మికులకు విముక్తి కలిగించేందుకు, తప్పిపోయిన చిన్నారులను గుర్తించేందుకు జులై నెలంతా ఆపరేషన్ ముస్కాన్ జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం కారణంగా గతంలో తప్పిపోయిన చిన్నారుల వివరాలను మదింపు చేయడం, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వారిని గుర్తించే ప్రయత్నం చేయడం, ఆన్‌లైన్ పోర్టళ్లలోని వివరాలతో క్రోడీకరించడం వంటి పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి, మహిళా శిశు సంరక్షణ విభాగం కమిషనర్ దివ్య తదితరులు ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. 2015 జులై నుంచి జరిగిన అయిదు ఆపరేషన్లలో 30 వేల 33 మంది చిన్నారుకు విముక్తి కల్పించినట్టు స్వాతి లక్రా తెలిపారు. ఈసారి దర్పణ్ యాప్‌లో వివరాలను నమోదు చేయడంతోపాటు సీసీటీఎన్‌ఎస్, చైల్డ్ పోర్టళ్లలోని వివరాలపై దృష్టి పెడతామని చెప్పారు.