ఈనెల 9 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రానికి వచ్చిన 1,216 మంది యూకే ప్రయాణికుల్లో 156 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఆరుగురు ఇతర దేశాలకు వెళ్లిపోయారు. ఇంకా 58 మంది ఇతర రాష్ట్రాల వారు ఉండడంతో ఆ రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ సమాచారం అందించింది. రాష్ట్రంలో ఇప్పటికే 996 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తొమ్మిది మంది ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది.
ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాల్లో 21 మందిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారి నమూనాలను సీసీఎంబీకి పంపినప్పుడే వరంగల్ కేసు బయటపడినట్టు తెలుస్తోంది. పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన వారు 9 మంది, హైదరాబాద్ నుంచి నలుగురు, జగిత్యాల నుంచి ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ నగర జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. పరివర్తనం చెందిన కరోనా వైరస్ నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం 72 గంటల్లోనే యూకే ప్రయాణికుల్లో 1,060 మందిని గుర్తించడం, 996 మందిలో పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
- ఇదీ చూడండి: రాష్ట్రంలోనూ యూకే వైరస్ కలకలం