మధ్యప్రదేశ్‌లో శియోపుర్ పట్టణం. రోడ్డు పక్కన కన్హయ్యలాల్ చెప్పులు కుడుతూ, అమ్ముతూ ఉంటాడు. ఆ వచ్చే ఆదాయంతోనే ఆరుగురు పిల్లల సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆ రోజూ అలాగే ఉన్నాడు.. ఇంతలో మెరుపులా దూసుకొచ్చింది మధు. ‘నాన్నా! నేను ఇంటర్ పాసయ్యా’ అంది. పాసవ్వడం అంటే అలా ఇలా పాసవ్వలేదు మధు. 97 శాతం మార్కులతో. 500 మార్కులకు 485 సాధించి... రాష్ట్రంలో సైన్స్ విభాగంలో మూడోస్థానం సాధించి తన పేరుతో పాటు తండ్రి పేరూ మార్మోగేలా పాసైంది.
కష్టంలోనూ ఇష్టంగా...
అలా వెళ్లి.. ఇలా పరీక్షలు రాస్తే వచ్చిన మార్కులు కావివి. అర్ధాకలితో పోరాడి సాధించుకున్న మార్కులవి. అమ్మానాన్నల కష్టాన్ని అర్థం చేసుకున్న కూతురు సాధించిన మార్కులవి. కన్హయ్యలాల్ పేదరికానికి చిరునామా. అతనుండేది రెండు గదుల ఇంట్లో. రెండు జతల జోళ్లు అమ్మడవ్వని రోజున.. ఇంటిల్లిపాదీ పస్తుండాల్సిందే! అయినా.. బిడ్డలను చదివించడం ఆపలేదాయన. అదృష్టం కొద్దీ పప్పన్నం దొరికిన రోజే కాదు.. పూటగడవక గంజి తాగిన రోజునా.. ఒకేలా చదివేవాళ్లు పిల్లలంతా. మధు అయితే మరీనూ! రేయింబవళ్లూ పుస్తకాల మీదే ధ్యాస.
ఊహించని భరోసా..
ఇంటర్ అయిపోయింది. డాక్టర్ అవ్వాలన్నది మధు కల. చదవడానికి ఆసక్తి ఉంది. చదివించే దాతలే కావాలి. అందుకే మీడియా ముందుకు వచ్చి తన ఇష్టాన్నీ, తండ్రి కష్టాన్నీ చెప్పుకొంది. ఈ మాట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ చెవిన పడింది. మధు కళ్లల్లో ఆయనకు సరస్వతి కనిపించింది. ట్విటర్ వేదికగా స్పందించారాయన. ‘మధు.. ఈ మామయ్య నీకు తోడుగా ఉంటాడు.. నీ ఇబ్బందులను పంచుకునేందుకు నేనున్నా.. డాక్టర్ కావాలనుకుంటున్న నీ కల సాకారం అవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ సందేశం పంపారు. అలా మధుకు సి.ఎం. మామయ్య అయ్యారు. ఇకపై మరింత పట్టుదలతో చదువుతానని మామయ్యకు మనస్ఫూర్తిగా మాటిచ్చింది.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ స్పందన: '‘పీఎం కిసాన్’'లో తెలంగాణకు చోటు