New Postings for IAS Officers in Telangana : విద్యుత్ శాఖలో కీలక బాధ్యతల్లో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించడంతో పాటు, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ట్రాన్స్ కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ ఫారూఖీని, టీఎస్ఎన్ పీడీసీఎల్ సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి వచ్చిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి కీలక బాధ్యతలు కేటాయించారు. ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం, మూసీ నది అభివృద్ధి సంస్థ ఇంఛార్జి ఎండీగా అదనపు బాధ్యతలను కేటాయించారు. వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా, ప్రజారోగ్య కమిషనర్‌గా శైలజ రామయ్యర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓఎస్డీగా డి.కృష్ణభాస్కర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా బి.గోపీ నియమితులయ్యారు.
స్థానచలనం పొందిన ఐఏఎస్‌లు వీరే :
- హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్- ఆమ్రపాలి
- మూసీ అభివృద్ధి సంస్థ ఇన్‌ఛార్జి ఎండీగా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు
- ఇంధన శాఖ కార్యదర్శి- సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ
- ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా రిజ్వికి అదనపు బాధ్యతలు
- ట్రాన్స్‌కో సంయుక్త ఎండీ- సందీప్‌కుమార్ ఝా
- ఉప ముఖ్యమంత్రి ఓఎస్‌డీ- కృష్ణ భాస్కర్
- దక్షిణ డిస్కమ్ సీఎండీ- ముషారఫ్‌అలీ
- ఉత్తర డిస్కమ్ సీఎండీ- కర్ణాటి వరుణ్ రెడ్డి
- వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి- శైలజా రామయ్యర్
- వ్యవసాయ శాఖ డైరెక్టర్- బి.గోపి
రిజ్వీకి కీలక బాధ్యతలు : తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో 1999 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ ట్రాన్స్ కో సీఎండీగాను, ఎస్‌పీడీసీఎల్(SPDCL) సీఎండీగాను పనిచేశారు. అప్పట్లో ఆయన అధికారులను పరుగులు పెట్టించేవారు. అలాగే సరిగా పనిచేయని ఒక డిస్కం(విద్యుత్ పంపిణీ సంస్థ) డైరెక్టర్‌ను రిజ్వీ నిలదీయడంతో ఆయన సెలవుపై వెళ్లారు. అయితే ఏడాదిలోపే ముర్తజా రిజ్వీ బదిలీ అయ్యారు.
IAS Officers New Postings in Telangana : తెలంగాణలో విద్యుత్ పదవుల్లో పనిచేసిన చివరి ఐఏఎస్ ఆయనే కావడం విశేషం. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పట్టభద్రుడు కావడం, గతంలో ట్రాన్స్ కో, ఎస్‌పీడీసీఎల్ సీఎండీగా పనిచేసిన అనుభవం ఉన్న దృష్ట్యా రిజ్వీకి రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇంధన శాఖ కార్యదర్శిగా, ట్రాన్స్ కో, జెన్ కో సంస్థలకు సీఎండీగా సర్కార్ నియమించింది. అయితే ఆయన ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా ఉన్నారు. ట్రాన్స్ కో, జెన్ కోలకు సుదీర్ఘకాలం సీఎండీగా పనిచేసిన ప్రభాకరరావు ఇటీవల తన పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ట్రాన్స్ కో జేఎండీగా సందీప్‌కుమార్ ఝా : ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి సందీప్‌కుమార్ ఝా (2014వ బ్యాచ్)ను ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్(JMD)గా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ పోస్టులో ఐఆర్‌టీఎస్(IRTS) అధికారి సి.శ్రీనివాస్‌రావు ఉన్నారు. ఆయన తొలుత డిప్యుటేషన్‌పై ఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.
డిప్యుటేషన్ ముగిసిన తర్వాత ఆయనను మాతృ సంస్థ అయిన రైల్వే శాఖకు వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. అయితే రైల్వే శాఖలో వీఆర్‌ఎస్(VRS) తీసుకొని, ట్రాన్స్ కోలోనే జేఎండీగా కొనసాగారు. ఆయనను ప్రభుత్వం తొలగించి సందీప్‌కుమార్ ఝాను నియమించింది. ముషారఫ్ అలీ ఫారుఖీ(2014 బ్యాచ్)ని ఎస్‌పీడీసీఎల్ సీఎండీగా, కర్నాటి వరుణ్ రెడ్డి(2019 బ్యాచ్)ని ఎన్‌పీడీసీఎల్ సీఎండీగా బాధ్యతలు అప్పగించింది.
రాజ భవనాన్ని తలపిస్తున్న ప్రజా భవన్ - లోపలి దృశ్యాలను చూస్తే వావ్ అనాల్సిందే