రాష్ట్రంలో రెండేళ్ల మద్యం విధానానికి ఈ నెలాఖరు నాటికి గడువు ముగుస్తుంది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి రావాల్సి ఉంది. ఆబ్కారీ శాఖ అధికారులు గత కొన్ని రోజులుగా నూతన విధానంపై కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో 2 వేల 216 మద్యం దుకాణాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో మండలాలు, మున్సిపాలిటీల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగింది. కొత్తగా 129 మండలాలు అదనంగా రానున్నాయి.
పోటీ తీవ్రతరం
దరఖాస్తుదారుల పోటీని తగ్గించేందుకు... లక్ష రూపాయలు తిరిగి ఇవ్వని డిపాజిట్ దరఖాస్తు రుసుంగా నిర్ణయించారు. గత ఏడాది నలభై వేలకు పైగా దరఖాస్తులు రాగా రూ.411 కోట్లు వరకు ఆదాయం వచ్చింది. ఏపీలో దుకాణాల సంఖ్య తగ్గించటం వల్ల లిక్కరు వ్యాపారులు రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలతోపాటు, హైదరాబాద్‌లోనూ పోటీ పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక, స్థానికేతరుల నిబంధన అమలు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
అదనంగా రూ.200 కోట్లు...
జనాభా ప్రాతిపదికన రూ.45 లక్షలు, రూ.55 లక్షలు, రూ.85 లక్షలు, రూ.1.20 కోట్లు లెక్కన నాలుగు రకాల స్లాబులు అమలవుతున్నాయి. 2017-19లో రూ.1360 కోట్లు లైసెన్స్ ఫీజు వచ్చింది. ఈ సంవత్సరం 10 నుంచి 15 శాతం లైసెన్స్ ఫీజు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల సర్కార్‌కు అదనంగా రూ.200 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీలోపు సీఎం అమోదం లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ వెంటనే నోటిఫికేషన్‌ను జారీ చేసి... ఒకటో తేదీ నుంచి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.