రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది. దీని వల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే ఇలా వస్తున్న పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశ్రమల శాఖను ఆదేశించారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కసరత్తు చేసిన పరిశ్రమల శాఖ ముసాయిదా తయారు చేసింది. దీనిపై ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి విస్తృతంగా చర్చించింది. తెలంగాణలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇందుకు పరిశ్రమలను రెండు విభాగాలుగా చేసింది. మొదటి విభాగంలో పాక్షిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికులకు 70 శాతం అవకాశాలు ఇవ్వనున్నారు. నైపుణ్యం కలిగిన మానవవనరుల్లో స్థానికులకు 50 శాతం ఉద్యోగాలు కేటాయించనున్నారు. రెండో విభాగంలో పాక్షిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికులకు 80 శాతం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికులకు 60 శాతం ఉద్యోగాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు ఇవీ ప్రోత్సాహకాలు
- మధ్యతరహా పరిశ్రమలకు విభాగం-1లో అదనంగా 5శాతం జీఎస్టీ ప్రోత్సాహకాలు. విభాగం-2లో అదనంగా 10శాతం. భారీ పరిశ్రమలకు విభాగం-1లో 5శాతం. విభాగం-2లో అదనంగా 10 శాతం ప్రోత్సాహకాలు.
- విద్యుత్‌లో: విభాగం-1లో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు 5సంవత్సరాల పాటు యూనిట్‌కు 50పైసల పరిహారం. మధ్యతరహా, భారీ పరిశ్రమలకు యూనిట్‌కు 75పైసల పరిహారం.. విభాగం-2లో అన్ని రకాల పరిశ్రమలకు యూనిట్‌కు రూపాయి చొప్పున పరిహారం.
- పెట్టుబడి రాయితీలో: సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రెండు విభాగాల్లో 5శాతం రాయితీ.
- నైపుణ్య వృద్ధికి చేసే వ్యయంలో: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో నైపుణ్యం గల మానవ వనరుల కోసం ఒకసారి శిక్షణకు అయ్యే ఖర్చులో ఒక్కొక్కరికి రూ.3000కి తగ్గకుండా 50శాతం ఖర్చు చెల్లింపు. భారీ పరిశ్రమలకు రూ.5000 పరిమితితో వంద శాతం ఖర్చు చెల్లింపు.
అన్ని ప్రోత్సాహాకాలు టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద లభించే ప్రోత్సాహాకాల కంటే అదనమైనవి.
ఇవీ చూడండి: తెలంగాణకు 37.67, ఏపీకి 17 టీఎంసీలు