MP KK on Women Reservation Bill : 2011 జనాభా లెక్కల ప్రకారమే.. మహిళా బిల్లు(Women Reservation Bill)ను ఎందుకు తీసుకురాకూడదని... రాజ్యసభ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ప్రశ్నించారు.నిబంధనల పేరిట కాలయాపన చేస్తున్నారని తప్పుబట్టారు. నియోజకవర్గ పునర్విభజన తర్వాత రిజర్వేషన్లు అమలైతే.. జనాభా నియంత్రణలో ఉంచుకున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్లను వేగంగా అమలు చేసేందుకు బిల్లులో సవరణలు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా కె.కేశవరావు మాట్లాడారు. 2011 జనాభా లెక్కల్ని పరిగణనలోకి తీసుకొని వెంటనే ఆ ప్రక్రియను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
"రాజ్యాంగంలోని ఏ నిబంధనలూ చూడకుండా ఆర్టికల్ 370ని రద్దు చేసిన ప్రభుత్వం షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేదా?. కాలయాపన కోసమే ప్రస్తుతం షరతులు పెట్టినట్లు కనిపిస్తోంది. సుదీర్ఘ ప్రస్థానం తర్వాత చారిత్రక బిల్లును తీసుకురావడం ఆనందంగా ఉంది. అందులో మేం భాగస్వాములం కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం." - కె.కేశవరావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత
Women Reservation Bill Passed in Parliament 2023 : పునర్విభజన ఆలస్యం వల్ల ఆ ఫలాలు 2030 వరకూ మహిళలకు అందే అవకాశం లేదని కె. కేశవరావు అన్నారు. కొత్త జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి ఆలోచించాలని.. వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేలా చూడాలని కోరారు. తెలంగాణ కూడా కుటుంబ నియంత్రణ పాటించడంతో జనాభా అదుపులోకి ఉందని.. కొత్త జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
"కొత్త జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ విస్తృతంగా జరిగినందున జనాభా వృద్ధిరేటు బాగా తగ్గింది. దీని ఫలితంగా సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. ఈ బిల్లు చట్టంగా మారాక, జనాభా లెక్కల సేకరణ చేపట్టి, దాని తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ప్రజాభిప్రాయం సేకరించి మొత్తం రిజర్వేషన్ల క్రతువును పూర్తి చేయడానికి 2030 వరకు సమయం పడుతుంది. అందువల్ల అంతకు ముందు జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి కూడా మహిళలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందవు." - కె.కేశవరావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత
బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. కేంద్రంలో రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంత ఆలస్యమై.. కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం.. ఎంతో కృషి చేస్తోందని, స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు.
Women Reservation Bill In Parliament : మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం