ఏపీలో వైకాపా ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆస్తి పన్ను విధానం వల్ల.. పూరి గుడిసె ఉన్న వారు కూడా.. పన్ను కట్టలేక ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోందని తెదేపా ఎంపీ కేశినేని నాని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం ఆస్తి పన్ను సహా ఇతర పన్నులు పెంచుతుందని కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే తాను చెప్పానని నాని గుర్తు చేశారు. తన మాటను ప్రజలు వినలేదన్నారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ ప్రథకాల పేరుతో ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తోందని మండిపడ్డారు.
గతంలో కేంద్రం నుంచి రూ.480 కోట్లు విజయవాడ నగరాభివృద్ధికి తెచ్చామని... ఇప్పుడు నగరం మురికి కుంటలా తయారైందని ఎంపీ విమర్శించారు. నగరంలోని 19 డివిజన్లో పార్టీ నూతర కార్యాలయాన్ని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి కేశినేని నాని ప్రారంభించారు. జగన్, కేసీఆర్ మధ్య సాన్నిహిత్యం ఉందని... ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారని కేశినేని ఆరోపించారు.
కేసీఆర్, జగన్ కలిసి ఒక పన్నాగంతో ఎన్నికల్లో గెలిచారని అన్నారు. జగన్, షర్మిల, కేసీఆర్ ముగ్గురూ ఒక్కటేనని... వ్యాపారాల కోసమే వారు నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల తరఫున పోరాడుతున్న తమ నాయకుల్ని గృహ నిర్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సంపద ఎక్కడికి పోతుందని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు ప్రశ్నించారు. ఉద్యోగాల ప్రకటనతో జగన్.. యువతను నడిరోడ్డుపై నిలబెట్టారని విమర్శించారు.
ఇదీ చూడండి: pulichintala project: ఏపీ ప్రభుత్వ విప్‌ను అడ్డుకున్న రాష్ట్ర పోలీసులు