సరిహద్దుల్లో పాకిస్థాన్ చర్యల వల్ల భారత సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ఆ దేశంతో టీ20 ఆడతారా? అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. అంతేకాకుండా దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, సరిహద్దుల్లో చైనా ఆక్రమణలపై ప్రధాని ఎందుకు మాట్లాడం లేదన్నారు. చైనా గురించి మాట్లాడాలంటే మోదీకి భయమని ఒవైసీ విమర్శించారు.
జమ్మూకశ్మీర్‌లో గత కొంతకాలంగా జరుగుతోన్న ఉగ్ర దాడుల్లో ఇప్పటివరకు తొమ్మిదిమంది సైనికులు అమరులయ్యారు. భారత పౌరుల జీవితాలతో పాకిస్థాన్ నిత్యం 20-20 ఆడుతోంది. ఇలాంటి సమయంలో అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో భారత్ టీ20 మ్యాచ్ ఆడబోతోంది. సైనికులు మరణిస్తున్నా పాకిస్థాన్‌తో టీ20 ఆడతారా?
- అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత
కేంద్రంలో భాజపా ప్రభుత్వ వైఫల్యం వల్లే జమ్మూ కశ్మీర్‌లో సామాన్య పౌరుల హత్యలు చోటుచేసుకుంటున్నాయని ఒవైసీ ఆరోపించారు. ఈ సమయంలో కేంద్ర హోంమంత్రి, ఇంటెలిజెన్స్ బ్యూరోలు ఏం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దేశ రాజధానితో పాటు పలు నగరాల్లో లీటరు పెట్రోల్ రూ.110కి చేరగా.. డీజిల్ ధరలు కూడా వంద దాటాయి. అయినప్పటికీ ఈ రెండు అంశాలపై ప్రధాని మోదీ మౌనంగా ఉంటున్నారని ఒవైసీ విమర్శలు గుప్పించారు.
గతకొన్ని రోజులుగా కశ్మీర్‌లో సాధారణ ప్రజలపై ఉగ్రదాడులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చిన కూలీలను శ్రీనగర్, పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదులు హత్యచేశారు. ఇలా గడిచిన నాలుగు వారాల్లోనే ఐదుగురు స్థానికేతరులను ఉగ్రవాదులు చంపేయడం అక్కడి వలస కూలీల్లో ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా చిరు వ్యాపారులు, వలస కూలీలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేస్తుండడంతో ఇతర రాష్ట్రాల ప్రజలు తిరిగి వారి స్వస్థలాలకు పయనమవుతున్నారు.
- భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే...
టీ20 ప్రపంచకప్ డ్రా విడుదలైంది. గ్రూప్ 2లో భారత్‌తో పాటు పాకిస్థాన్ కూడా ఉంది. 8 జట్లు నేరుగా పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించగా.. మరో నాలుగు స్థానాల కోసం క్వాలిఫయర్స్‌లో 8 జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ అక్టోబర్ 17న ప్రారంభమవుతుంది.
అక్టోబర్‌లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో వారికి మరింత ఊరటనిస్తూ మెగాటోర్నీ డ్రాను విడుదల చేసింది ఐసీసీ. ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. దాయాది దేశాలు భారత్-పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉండటం. మార్చి 2021నాటి ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ డ్రాను ప్రకటించారు. దీనిని సూపర్ 12 మ్యాచ్‌లుగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనుంది.
ఇదీ చదవండి: Revanth reddy comments: అధికారం కోసం కుల, మతాలను రెచ్చగొడున్నారు