Cold weather in TS: రాష్ట్రంలో చలి తీవ్రత వణికిస్తోంది. రోజురోజుకి చలి పెరుగుతోంది. పెరిగిన చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచే శీతలగాలులు వీస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి తెలంగాణా రాష్ట్రం వైపు చల్ల గాలులు వీస్తున్నాయి. మరో మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో సాధారణ కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశముందని తెలిపారు.
రాజధాని శివార్లలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
సూర్యాస్తమయం నుంచి సూర్యోదయమైన గంట దాకా శీతలగాలులు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆరు బయటికెళితే చలి తీవ్రత మరింత భయపెడుతోంది. శీతాకాలం మొదలైన రెండున్నర నెలల తరవాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చలి బాగా పెరిగింది. హైదరాబాద్ నడిబొడ్డున బేగంపేట ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా 13.2 డిగ్రీలు నమోదైంది.
Temperatures down:అక్కడితో పోలిస్తే శివారు ప్రాంతాల్లో అంతకన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువగా ఉంటోంది. నగర శివారు మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో అత్యల్పంగా 8.5, రాజేంద్రనగర్‌లో 9.9 డిగ్రీలే ఉంది. ఆ ప్రాంతంలో చెట్లు, ఖాళీ ప్రదేశాలున్నందున అక్కడి వాతావరణం మరింత చలిగా ఉంటోంది. శీతాకాలంలో కారుమబ్బులు ఏర్పడితే భూవాతావరణం త్వరగా వేడెక్కదు. రాష్ట్రంలో గత నాలుగైదు రోజుల నుంచి ఆకాశంలో మేఘాలు బాగా తగ్గిపోయాయి. నింగి నిర్మలంగా ఉంటే భూమి వాతావరణం త్వరగా చల్లబడి ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. ఉదాహరణకు ఆదివారం తెల్లవారుజామున నగరం చుట్టుపక్కల 8.5 నుంచి 13.2 డిగ్రీలతో చలి ఎక్కువగా ఉన్నందున ఆదివారం పగలు కూడా గరిష్ఠ ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలే నమోదైంది. భూ వాతావరణం బాగా చల్లబడినప్పుడే ఇలా రాత్రి, పగలు మధ్య వ్యత్యాసం 15 డిగ్రీలలోపు ఉంటుంది. దీనికితోడు ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి శీతల గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. వాయవ్య భారతం నుంచి హిమాలయాల వరకూ గాలుల్లో అస్థిరత ఏర్పడి ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అక్కడి నుంచి శీతల గాలులు ఉద్ధృతంగా తెలంగాణ వైపు వీస్తున్నందున ఇక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న చెప్పారు. సోమవారం నుంచి 4 రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగుతుంది. హైదరాబాద్‌లో బేగంపేట వద్ద గత పదేళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రత 2018 డిసెంబరు 31న 9.5 డిగ్రీలుగా రికార్డు ఉంది. నగరంలో ఇప్పుడు ట్రాఫిక్, కాలుష్యం వల్ల 12 నుంచి 13 డిగ్రీలుంటోంది. శివారుల్లో చెట్లు, ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 8 నుంచి 10 డిగ్రీలుంటోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య సమస్యలున్నవారు ఉదయం 8 గంటలలోపు బయట తిరగడం మంచిదికాదని నాగరత్న సూచించారు.