హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణీదేవి.. సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్లో కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ్చి, అన్నీతానై తన గెలుపునకు కారణమైన సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన అందరికి రుణపడి ఉంటానని చెప్పారు. ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన పార్టీకి, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని వాణీదేవి తెలిపారు.
వాణిదేవికి అభినందనలు తెలిపిన సీఎం.. శాలువాతో ఆమెను సత్కరించారు. విజయాన్ని కట్టబెట్టిన అన్ని వర్గాల ప్రజలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం పని చేసిన మంత్రులు, నేతలు, కార్యకర్తలకు సీఎం అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, సంతోశ్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'అభివృద్ధి చూసే పట్టభద్రులు తెరాసను ఆశీర్వదించారు'