రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్‌ఐపాస్, సింగిల్ విండో అనుమతులు లాంటి అనేక చర్యలతో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సీఎం కేసీఆర్ ముందు చూపు విధానాలతోనే... దేశ విదేశాల నుంచి అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో క్రిస్సమ్ -ఫర్నీచర్ ఇంటీరియర్ షోరూంను ఆమె ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ఫర్నిచర్ షోరూంలో ఉద్యోగాలన్ని స్థానిక యువతకే ఇస్తానని తెలిపిన నిర్వాహకుడు కిరణ్‌ను కవిత అభినందించారు.
టీఎస్‌ఐపాస్ ప్రత్యేకతలు
- పారిశ్రామిక అనుమతులు పొందే హక్కు; దరఖాస్తుదారు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఆమోదాలు.
- అన్ని విభాగాలకు కలిపి 35 సేవల కోసం ఒకే సంయుక్త దరఖాస్తు ఫారం.
- ఆన్‌లైన్‌లో నమోదు అనుమతుల ప్రక్రియ... 15 రోజుల్లోపు అనుమతులు.
- రూ. 200 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి గల ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని టీ-స్విఫ్ట్ బోర్డు.
- నిర్ణీత కాలంలో అనుమతులు ఇవ్వకుంటే అధికారులకు రోజుకు రూ .1,000. అలా 25 రోజులు జాప్యం జరిగితే రూ. 25 వేల వరకు జరిమానా.
- గడువులోగా అనుమతులు రాకపోతే నేరుగా పొందినట్లు ఆమోదం.
- తప్పుడు సమాచారం ఇస్తే పారిశ్రామికవేత్తలకు జరిమానా; ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత రెండేళ్లలో పరిశ్రమను ప్రారంభించకపోతే భూముల స్వాధీనం
అమలు ఇలా...
కొత్త చట్టం అమల్లోకి వచ్చాక నిర్ణీత పరిమితి మేరకే అన్నిటికీ అనుమతులు వచ్చాయి. కొన్ని శాఖల్లో సమన్వయలోపం, సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం జరిగింది. తర్వాత అంతా సజావుగా సాగింది. సరళతర వాణిజ్య నిర్వహణ (ఈవోడీబీ) విధానం వల్ల పోటీ తత్వం పెరిగి రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ సంస్కరణలు చేపట్టడం వల్ల టీఎస్‌ఐపాస్ సేవలు మరింత వేగవంతమయ్యాయి. టీఎస్‌ఐపాస్ కింద అనుమతి పొందిన సంస్థలేమీ ఇప్పటివరకు రద్దు కాలేదు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ప్రదర్శనల్లో ప్రచారం నిర్వహించింది. సరళతర వ్యాపార నిర్వహణలో తెలంగాణ అగ్రస్థానం పొందడానికి ఈ విధానం దోహదం చేసింది.
ఇదీ చదవండి: boy lost hand: చిన్న గాయమే అని కట్టుకట్టారు.. చేతిని పోగొట్టారు.!