Jaggareddy Interesting Comments: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాద విధానాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. దేశ ప్రజల భద్రత కోసం తీసుకున్న నిర్ణయాల కారణంగానే.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ బలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. నక్సలైట్లు ప్రజల కోసం చేసే పోరాటం చూసి.. జనజీవనంలో కలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిపినట్లు వెల్లడించారు. వారిని ప్రజల్లో కలిసే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో పలు అంశాలపై ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
చట్ట పరిధిలో ఉద్యమాలు చేయకపోవడం వల్లే.. నక్సలైట్లు అడవుల్లో ఉంటూ సమస్యలు ఎదుర్కొనాల్సి వచ్చిందని జగ్గారెడ్డి అన్నారు. రాజకీయ నాయకులు, నక్సలైట్లు కూడా ప్రజల మంచి కోసమే పోరాడుతున్నారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు చట్టసభల పరిధిలో పని చేస్తుండగా.. నక్సలైట్లు చట్టం పరిధి దాటి పని చేస్తున్నారని తెలిపారు. అందువల్లే సమాజానికి దూరంగా ఉండాల్సి వస్తుందని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుందని జగ్గారెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలు అయ్యాక ఎవరి నియోజకవర్గాల్లో వారు పాదయాత్ర చేస్తారని స్పష్టం చేశారు. ఇతర నియోజకవర్గాల నేతలు పిలిస్తే.. వారి నియోజకవర్గంలో కూడా పాదయాత్ర చేస్తామని అన్నారు. తన జీవితమంతా ముత్యాలముగ్గు సినిమాలోని హీరోయిన్ మాదిరి అయ్యిందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: నా ఆస్తులు, కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: రేవంత్రెడ్డి