Etela Rajender in Raithu Deeksha: తెరాస నాయకులకు పాలన చేతకాకపోతే గద్దె దిగాలంటూ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద భాజపా 'రైతు దీక్ష' పేరుతో నిరసన దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఈటల... తెరాసపై విమర్శలు గుప్పించారు. వడ్లు కొనేందుకు 2021లో కేంద్రం రూ.26 వేల కోట్లు ఇచ్చిందని ఈటల గుర్తు చేశారు. తాము ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్రం మెడ మీద కత్తి పెట్టి లేఖపై సంతకం పెట్టించిందంటున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ మాత్రం దానికి మీరెందుకున్నారని... పాలన చేతకాకపోతే గద్దె దిగాలంటూ ఎద్దేవా చేశారు. సాగు బాగాలేకపోతే గ్రామాలు నిస్తేజంగా మారుతాయని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల గోస ఇవాళ కేసీఆర్‌కు తగులుతుందన్నారు. సూర్యాపేటలో మొన్న రూ.1,250కు వడ్లు అమ్ముకునే పరిస్థితి కల్పించారని దుయ్యబట్టారు. భాజపా చేపట్టిన దీక్ష ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను చల్లగా చూడమని అధికారం నీకిస్తే... చేతగాక, చేవలేక రాష్ట్రాన్ని వదిలి ఎందుకు దిల్లీలో ధర్నా చేసావో చెప్పగలవా కేసీఆర్. వడ్లు కొనేందుకు 2021లో కేంద్రం రూ.26 వేల కోట్లు ఇచ్చింది. మేము ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇచ్చింది. కేంద్రం మెడ మీద కత్తి పెట్టి లేఖపై సంతకం పెట్టించిందంటున్నారు. మరి మీరెందుకున్నారు... మీకు పాలన చేతకాకపోతే గద్దె దిగండి.
--ఈటల రాజేందర్, ఎమ్మెల్యే
ఇదీ చూడండి: ముఖ్యమంత్రిని జైల్లో వేస్తామంటారా? దమ్ముంటే రండి: కేసీఆర్