Talasani Srinivas Yadav On Governor: గవర్నర్ తమిళిసైపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగ పరమైన హోదాలో ఉన్నారని... వారి పరిమితులకు లోబడి మాట్లాడాలని హితవు పలికారు. గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందన్నారు. గవర్నర్‌కు ఒక పరిధి ఉందని.. ఆ పరిధిని భారత రాజ్యాంగం పెట్టిందన్నారు. ప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే బాధ్యత రాహిత్యం అవుతుందని చెప్పారు. గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడకూడదని... గతంలో గవర్నర్లను గౌరవించామని వారిని ఎలా గౌరవించాలో తమకు, ముఖ్యమంత్రికి తెలుసన్నారు.
గవర్నర్ చట్ట పరిధి దాటి మాట్లాడుతున్నారని... ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదని తలసాని సూచించారు. ప్రధాని, హోంమంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవసరం లేదన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్ని విషయాలు మీడియాతో మాట్లాడలేనని తమకు పరిధులు ఉంటాయని... హుందాతనంగా వ్యహరించారని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు గవర్నర్‌ను వాడుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రతిపక్ష పార్టీలకు నోటికి బట్ట లేదని విమర్శించారు. వరి దాన్యం మీద పోరాటం చేస్తున్నామని... రైతులకు అవసరమైన విధంగా మాట్లాడాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ప్రతిపక్షాలు ఉండడం దురదృష్టకరమన్నారు. ధాన్యం ఎందుకు కొనరో భాజపా నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి నూకలు తినాలి అనడం సరికాదని హితవు పలికారు. 24 గంటల విద్యుత్ సరఫరా రాష్ట్రంలో ఉందని... వాళ్లు పాలించే రాష్ట్రాల్లో లేదని అందుకే వాళ్లకు ఈర్ష్య అన్నారు. వ్యవస్థలను పని చేయనివ్వాలని... కానీ పక్కదారి పట్టించవద్దని మంత్రి సూచించారు.
'గవర్నర్లను ఎలా గౌరవించాలో మాకు, సీఎంకు తెలుసు. గవర్నర్లను గౌరవించడంలో కేసీఆర్ అందరికంటే ముందుంటారు. ఎలాంటి లోటుపాట్లు జరగనప్పుడు విమర్శలు చేయటం సరికాదు. గవర్నర్లు వారి పరిమితులకు లోబడి మాట్లాడాలి. గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడకూడదు. ప్రధాని, కేంద్రమంత్రిని కలిసిన తర్వాత మాపై విమర్శలు చేయడమేంటి. మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని గవర్నర్ ఎలా రద్దు చేస్తారు? గవర్నర్ వ్యవస్థ వద్దని ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. పెద్దలసభలో నియామకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. భాజపా పారిశ్రామికవేత్తలను రాజ్యసభకు పంపలేదా? డ్రగ్స్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.' - తలసాని శ్రీనివాస్‌యాదవ్, మంత్రి
ఇదీ చూడండి: