Sabitha Respond On Banjarahills Girl Rape Case: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో చిన్నారిపై లైంగికదాడి ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్యలు చేపట్టారు. బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర పాఠశాలల్లో విద్యార్థులను సర్దుబాటు చేయాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలు నివృత్తి చేసే బాధ్యత డీఈవోదేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. భద్రతా పరమైన చర్యలు ప్రభుత్వానికి సూచించేందుకు కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కమిటీ తన నివేదికను వారం రోజుల్లోగా అందిస్తుందని పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంభందించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
అసలేం జరిగిదంటే: బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారి ఎల్‌కేజీ చదువుతోంది. కొన్నాళ్లుగా నీరసంగా ఉంటున్న బాలిక సోమవారం పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక ఏడుస్తుండటంతో తల్లి బిడ్డను ఎత్తుకొని ఆరా తీసింది. పాఠశాల ప్రిన్సిపల్ వద్ద పదేళ్లకు పైగా డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు, రెండు నెలలుగా ఇదే తరహాలో ఇబ్బంది పెడుతున్నట్లు తెలుసుకున్నారు.
మంగళవారం నేరుగా తమ స్నేహితులు, బంధువులతో కలిసి పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు అక్కడే ఉన్న డ్రైవర్‌ని చితకబాదారు. ఒక దశలో పాఠశాల ప్రిన్సిపల్‌పైకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. సిబ్బంది సర్దిచెప్పడంతో శాంతించారు. డిజిటల్ క్లాస్‌రూంలో పిల్లలతో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నా.. దృష్టి పెట్టలేదని ప్రిన్సిపల్‌పై మండిపడ్డారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఎస్సైలు అంబిక, మనోజ్‌కుమార్ అక్కడికి చేరుకొని డ్రైవర్ రజనీకుమార్‌ను అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: చిన్నారిపై అత్యాచారం కేసు.. నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. ప్రిన్సిపల్ డ్రైవర్‌ను చితక్కొట్టిన తల్లిదండ్రులు