Minister Mallareddy gave scholarships to the students: తనదైన స్టైల్లో చమత్కారంగా మాట్లాడే మంత్రి మల్లారెడ్డి తాజాగా తన మాటలతో యువతను ఉత్తేజ పరిచారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను ఇచ్చే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని తనదైన శైలిలో మాట్లాడి విద్యార్థులను మోటివేట్ చేశారు. రెడ్డి జనసంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు.
హైద్రాబాద్ అబిడ్స్ లోని రెడ్డి వసతి గృహ సమావేశ మందిరంలో రెడ్డి జన సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 326 మంది నిరుపేద విద్యార్థులకు 27లక్షల ఉపకార వేతనాలను సంఘం నాయకులతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. యువత తీరుపై తనదైన శైలిలో స్పందించిన మల్లారెడ్డి... చిరిగిన జీన్స్ వేసుకొని పబ్‌లు, హోటల్స్, అమ్మాయిలతో తిరిగితే యువత ఫేమస్ అవుతారని చురకలంటించారు. తాను 23వ ఏటా ఒక సైకిల్ రెండు పాల క్యాన్లతో జీవితాన్ని ప్రారంభించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో మంత్రిగా ఫేమస్ అయ్యానని పేర్కొన్నారు. కష్టపడితేనే యువత ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతారని సూచించారు. దేశంలో ఉన్న బిలియనీర్లంతా పాతికేళ్ల వయస్సు గల వారేనని మల్లారెడ్డి యువతకు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం దేశంలో నంబర్ వన్ గా ఉందని.. యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు మంత్రి సూచించారు.
"ఆ రోజుల్లో వంద సంవత్సరాల క్రితం ఏమీ లేకుండే. అయినా ఇంత పెద్ద సంస్థను వెంకట రంగారెడ్డి స్థాపించారు. కానీ ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి. కానీ, మనం అదే పాత బిల్డింగ్‌లలో, అదే పాత స్కాలర్షిప్లు, అదే పాత లెక్క చేస్తున్నాం. ఆ రోజుల్లోనే ఇంత బిల్డింగ్ కట్టారంటే ఇప్పుడు మనం ఏం చేయవచ్చనేది ఆలోచించండి. ముఖ్యమంత్రి కేసీఆర్ 15 ఎకరాలు భూమిచ్చి, 10కోట్ల రూపాయలిచ్చారు. ఇంత పెద్ద బిల్డిండ్ ఇంత ఉన్నప్పుడు ఇదంతా విద్యార్థులతో కళకళలాడాలి. ఐఏఎస్ కోచింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. కేసీఆర్ ఇచ్చిన 15 ఎకరాలలో అన్నింటిని బాగా అభివృద్ధి చేసి చరిత్ర చేయండి. దానినంతా గొప్ప స్థాయికి తీసుకెళ్లే బాధ్యత మనందరి మీద ఉంది. యువత మీరు పర్ఫెక్ట్గా చదువుకోవాలి ఇదే నా రిక్వెస్ట్. మీకు మంచి అవకాశాలున్నాయి. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. నాకు ఇంత ట్రెండింగ్ ఎందుకు వస్తుందో అర్థం కావటం లేదు. నేనేమి ప్రొఫెసర్‌ను కాదు, యాక్టర్, ఇంజినీర్, డాక్టర్‌ను కూడా కాదు. నేను సింపుల్, లో ప్రొఫైల్ వ్యక్తిని. కానీ ఇంత ట్రెండింగ్ ఎందుకొస్తుందో అర్థం అవ్వటం లేదు. నా పరిస్థితి ఏంటో మీక్కూడా తెలుసు. మీ వయస్సులో ఉన్నప్పుడు నా పరిస్థితి ఒక సైకిల్, రెండు పాల క్యాన్లు."_మల్లారెడ్డి, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి
ఇవీ చదవండి: