Minister Harish Rao: ఆరోగ్య శ్రీ సేవలను పీహెచ్సీ స్థాయికి విస్తరించనున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. పీహెచ్‌సీల పనితీరుపై అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లతో మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ టెలీకాన్ఫరెన్స్‌లో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ జి.శ్రీనివాస రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డీఎంఇ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన మంత్రి.. పీహెచ్‌సీల పరిధిలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు, వారికి అందుతున్న వైద్య సేవలు, గర్బిణులకు వైద్య సేవలు, వ్యాక్సినేషన్, ఎన్‌సీడీ స్క్రీనింగ్, మందులు, పరీక్షలు తదితర అంశాలపై సమీక్షించారు.
పీహెచ్‌సీలు నమోదు చేసుకోవాలి.. ఆరోగ్య శ్రీ సేవలను పీహెచ్సీ లకు వర్తింపజేయాలని నిర్ణయించినట్టు తెలిపిన మంత్రి.. ఇందుకోసం పీహెచ్‌సీలు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఏఎన్‌సీ టెస్టుల ద్వారా మాతా, శిశు మరణాలు తగ్గించడం సాధ్యమవుతుందన్న ఆయన.. వైద్యులు మారుమూల ప్రాంతాల్లో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారనే కారణంతో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలలో 30 శాతం ఇన్ సర్వీస్ కోటాను ప్రభుత్వం కల్పించిందన్నారు. పీహెచ్‌సీల్లో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని రోగులకు బయట నుంచి మందులు తెచ్చుకోవాలని సూచిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. 24 గంటలు నడిచే పీహెచ్‌సీలు అత్యవసర సేవలను అన్ని వేళల్లో అందించాలని సూచించారు.
ఆ మందులు లేవంటే చర్యలే.. పాము కాటు, కుక్క కాటు మందులు తప్పకుండా పీహెచ్‌సీల్లో ఉండాలన్న ఆయన... మందులు లేవని ఫిర్యాదులు వస్తే బాధ్యులుగా చేస్తూ చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాంలో ఎప్పటికప్పుడు వివరాలు అప్‌లోడ్ చేయాలన్నారు. ఇక అవసరమైతే కొత్త పీహెచ్‌సీలు నిర్మిస్తామన్న ఆయన... పెద్ద మొత్తంలో మరమ్మతులు ఉన్న పీహెచ్‌సీల్లో వెంటనే రిపేర్లు మొదలు పెడతామని తెలిపారు.
నర్సుల ఆందోళనపై మంత్రి ఆగ్రహం: నిమ్స్‌లో నర్సుల ఆందోళనను మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ఆయన... తక్షణం ఆందోళన విరమించాలని నర్సులను ఆదేశించారు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌తో మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గత నెలలో నిమ్స్ నర్సులు ఆందోళన చేసిన నేపథ్యంలో ఎన్హెచ్ఎం కాంట్రాక్టు నర్సులతో సమానంగా 30 శాతం వేతనం పెంచిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి.. గత నెలలో అడిగిన అన్ని డిమాండ్లను పరిష్కరించినప్పటికీ ఇప్పుడు నర్సులు మాట మార్చి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న వారికి రెగ్యులర్ నియామకాల్లో వెయిటేజ్ ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించిన మంత్రి.... నిమ్స్ నర్సులు మొండిగా ముందుకు సాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Mission Bhageeratha: ఏ ఒక్క గ్రామంలోనూ నీటి ఎద్దడి రావొద్దు: స్మితా సబర్వాల్