Gangula review on paddy procurement: గతేడాది కంటే 30 శాతం అధికంగా ధాన్యం సేకరించామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతి.. రైతుల ఇబ్బందులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. వానాకాలం మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు, రైతుల ఇబ్బందులు, కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు, నగదు చెల్లింపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రతికూల సమయంలోనూ ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయన్న మంత్రి గంగుల.. నగదు చెల్లింపులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. రవాణా, గన్నీ బ్యాగుల కొరత లేదని పేర్కొన్నారు. ఓపీఎంఎస్‌లో నమోదైన వెంటనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో గతేడాది ఇదే రోజుకంటే ఈసారి దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేశామని తెలిపారు.
వేగంగా నగదు చెల్లింపు
paddy procurement in Telangana : రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1280 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని.. రూ.5,447 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇప్పటివరకు 6,775 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేపడుతున్నామని వెల్లడించారు. ఆదివారం వరకు 42.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా... ఆ విలువ రూ.8,268 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. ఓపీఎంఎస్‌లో నమోదైన 4.5లక్షల మంది రైతులకుగానూ 3.75 లక్షల మందికి నగదు చెల్లింపులు సైతం పూర్తి చేశామన్నారు.
కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. గతేడాది కంటే 30 శాతం అధికంగా ధాన్యం సేకరణ చేశాం. ధాన్యం రైతుల నగదు చెల్లింపులకు నిధుల కొరత లేదు. ఓపీఎంఎస్‌లో నమోదైన వెంటనే రైతులకు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు రూ.5,447 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. 1,280 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఎఫ్‌సీఐ తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రైతుల పట్ల కేంద్రం, ఎఫ్‌సీఐ తీరు విచారకరం.
-గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి
గోదాముల కొరత
paddy procurement 2021: ఎఫ్‌సీఐ గోదాములు రాష్ట్రంలో దాదాపుగా అన్నీ నిండిపోయాయని ప్రకటించారు. సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నిర్మల్ జిల్లాల్లో గోదాములు పూర్తిగా నిండాయని... మిగతా చోట్ల సైతం నిలువ కొరత వేధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్‌సీఐ... గోదాములు లీజుకు తీసుకోవడానికి అంగీకరించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. సరైన సమయానికి ర్యాక్‌లు పంపడం లేదని చెప్పారు. గిడ్డంగుల నుంచి బియ్యం తరలింపు జరగక.. మిల్లుల్లో ఉన్న బియ్యం ఎఫ్‌సీఐ గోదాముల్లోకి తీసుకోలేకపోతుందని తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్రం, ఎఫ్‌సీఐకి లేఖలు పంపించినప్పటికీ... స్పందన లేదని మంత్రి కమలాకర్ పేర్కొన్నారు.
ఎఫ్‌సీఐ తీరుతోనే ఇబ్బందులు..
భారత ఆహార సంస్థ తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి వెల్లడించారు. రైతుల పట్ల కేంద్రం, ఎఫ్‌సీఐ తీరు విచారకరమని గంగుల విమర్శించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Chilli Farmer Suicide Mulugu : పురుగుల మందు తాగి మిరప రైతు ఆత్మహత్య