కరోనా మహమ్మారి బారిన పడినప్పటికీ వసతి ఉన్న వాళ్లకు ఇళ్లలోనే చికిత్స ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. నగరంలో పలువురు ఇళ్లలో ఉండి చికిత్స పొందాలని భావించినప్పటికీ... చుట్టూ పక్కల వారు... పాజిటివ్ ఉన్న వాళ్లను ఇళ్లలో ఉంచితే తమకు వ్యాధి సోకుతుంది అని భయపడుతున్నారు అని ఈటల పేర్కొన్నారు.
వైరస్ ఒకరి నుంచి ఒకరికి తుంపరాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని మంత్రి ఈటల తెలిపారు. ప్రజలు హోమ్ క్వారంటైన్ ట్రీట్మెంట్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో జలుబు, దగ్గు ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించాలని మంత్రి ఈటల ఆదేశాలు జారీ చేశారు. ప్రజల జీవన ఉపాధి దెబ్బతినకుండా మాత్రమే ప్రభుత్వం లాక్డౌన్ సడలించిందన్న మంత్రి... అత్యవసరం అయితే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పిలుపునిచ్చారు. సమీక్షలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్, డీఎంఈ రమేష్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.