తాము ‘ఇక్కడే పుట్టామని... ఇక్కడే చస్తామని' ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. చచ్చేవరకు భారతీయులమేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అసలు తామెందుకు ధ్రువీకరణ పత్రాలు చూపించాలో చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నించారు. ’శనివారం రాత్రి ఎంఐఎం ఆధ్వర్యంలో పాతబస్తీ ఖిల్వత్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మతం ఆధారంగా.. జీవించే హక్కును హరించవద్దంటూ అఖిల భారత ముస్లిం నేతలు గళమెత్తారు.
ఆయన పాలనపై వ్యంగ్యాస్త్రాలు...
అంతకుముందు జరిగిన ముషాయిరా కవి సమ్మేళనానికి దేశంలోని వివిధ కవులు, కళాకారులు హాజరయ్యారు. అనంతరం పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా తమ కవితల్ని వినిపించారు. మోదీ పాలనను, మన్ కీ బాత్ సహా పలు చట్టాల రద్దులను ప్రస్తావిస్తూ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలను సంధించారు. జామియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థి ఆమేర్ అజీజ్ తన ప్రసంగంలో కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు.
రాజ్యాంగం పరిరక్షణ కోసమే...
రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలంతా ఉద్యమిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ముస్లిం మత ప్రముఖుడు మౌలానా హుస్సాముద్దీన్ అన్సారీ విమర్శించారు. స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులతో పోరాడామని, ఇప్పుడదే స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నామన్నారు. పోలీసులు అనుమతిస్తే ఈ నెల 30న నగరంలో మానవహారం నిర్వహించుకుందామంటూ హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు.
జన సంద్రాన్ని తలపించిన మైదానం...
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మొదట్నుంచి మజ్లిస్ నిరసనలు తెలియజేస్తోంది. ఇందులో భాగంగా గణతంత్రదినోత్సవం సందర్భంగా ముందురోజు నిర్వహించిన బహిరంగ సభకు ఊహించిన దానికంటే ఎక్కువమందే హాజరవడంతో ఖిల్వత్ మైదానం కిక్కిరిసిపోయింది.
ఇదీ చూడండి: బస్తీకా బాద్షా: పట్టణాల్లో గులాబీ పార్టీకి పట్టం.